|  
● FLASH NEWS
OTT: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఇంటి తెరపైకి.. ఈ వారం కొత్త రిలీజులివే  •  Attack: పోలింగ్ వేళ అఖిలప్రియ వాహనంపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం  •  HighCourt: సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు  •  26/11 తరహా బాంబు బెదిరింపు ఈమెయిల్… పోలీసులు ఏమన్నారంటే..!  •  Hormuz: జలసంధిలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న రెండు చమురు ట్యాంకర్లు!  •  Markets: ఒక్క రోజులో 1,502 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. కారణమిదే!  • 
Skip to content

BRAOU: జడ్జీల నియామకాల్లో ‘కనిపించని వీటో’.. కొలీజియంపై రాజేందర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం (Collegium) నిర్ణయాలు స్వతంత్రంగా జరిగేలా, వాటిని వెంటనే అమలు చేసేలా పాలనలో మరింత పారదర్శకత ఉండాలని ప్రముఖ న్యాయవేత్త, న్యాయశాస్త్ర పరిశోధకుడు, మాజీ న్యాయమూర్తి డా. మంగారి రాజేందర్ (జింబో) అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గురువారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ (Constitution Day) ప్రత్యేక ఉపన్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు.

‘న్యాయమూర్తుల నియామకాల్లో కనిపించని వీటో: కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ’ అనే అంశంపై విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాన వక్తగా మంగారి రాజేందర్ ప్రసంగించగా, విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తగా కూడా పేరున్న రాజేందర్ ఈ అంశంపై వివరంగా ఉపన్యసించారు.

డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక ఉపన్యాస వేదికపై డా. మంగారి రాజేందర్, వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తదితరులు
‘న్యాయమూర్తుల నియామకాల్లో కనిపించని వీటో’ అంశంపై జరిగిన ప్రత్యేక ఉపన్యాస వేదికపై డా. మంగారి రాజేందర్ (జింబో), వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తదితరులు

కనిపించని వీటోతో స్వతంత్రతకు ప్రమాదం

ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, చట్టబద్ధ పాలనకు స్వతంత్ర న్యాయవ్యవస్థ అత్యంత అవసరమని రాజేందర్ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల ప్రభావానికి లోనుకాకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, నిర్భయంగా పనిచేయాలని ఆయన అన్నారు.

న్యాయమూర్తుల నియామకాలపై కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం ప్రత్యక్ష తిరస్కరణ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. కొలీజియం సిఫారసులను ఆలస్యం చేయడం, నిర్ణయాన్ని వాయిదా వేయడం, లేదా వాటిపై నిర్ణయమే తీసుకోకపోవడం ద్వారా కూడా న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కొలీజియం అభ్యర్థుల పేర్లను అధికారికంగా పరిశీలించకముందే ప్రభుత్వం నుంచి అనధికారిక ఆమోదం కోరడం కూడా నియామకాల ప్రక్రియ స్వతంత్రతను బలహీనపరుస్తుందని రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.

పారదర్శకత, స్పష్టమైన ప్రమాణాలు అవసరం

అదే సమయంలో కొలీజియం వ్యవస్థలోనూ లోపాలున్నాయని ఆయన ప్రస్తావించారు. పారదర్శకత సరిగా లేకపోవడం, న్యాయమూర్తుల ఎంపికకు స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం ఈ క్రమంలోని ముఖ్య సమస్యలని పేర్కొన్నారు.

నియామకాల్లో పారదర్శకత, స్పష్టమైన ఎంపిక ప్రమాణాలు, సిఫారసులపై నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువులు, జవాబుదారీతనం లోపించాయని రాజేందర్ అన్నారు. అన్ని వైపుల నుంచి అనుమానాలు వస్తున్న నేపథ్యంలో నిర్దిష్ట కాలపట్టిక అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు ప్రజల నమ్మకమే పునాది అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండటమే కాదు, అది స్వతంత్రంగా పనిచేస్తోందనే విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లకుండా చూడాలని సూచించారు. కార్యనిర్వాహక వ్యవస్థతో సంప్రదింపులు లొంగుబాటుగా మారకూడదని, న్యాయపరమైన సంయమనం ప్రభుత్వానికి విధేయతగా మారకూడదని హెచ్చరించారు.

న్యాయవ్యవస్థను బలహీనపరచడం కాకుండా, వ్యవస్థలోనే అవసరమైన సంస్కరణలు చేపట్టాలని రాజేందర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల నిబద్ధత, నిజాయితీ ఎంత ముఖ్యమో వివరిస్తూ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి, స్వతంత్రత, విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన సూచించారు.

రాజ్యాంగ పరిరక్షణ యువత బాధ్యతే

ముఖ్య అతిథిగా మాట్లాడిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, డా.బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించిన ‘ఒక వ్యక్తికి ఒక ఓటు, ప్రతి ఓటుకు సమాన విలువ’ అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని గుర్తు చేశారు.

నేడు దేశంలో ఓటర్ల ఏరివేత కొనసాగుతోందని, ఇది మంచి పరిణామం కాదని వీసీ అభిప్రాయపడ్డారు. ప్రతి వ్యక్తి తాను జీవించి ఉన్నానని, తన గుర్తింపును నిరూపించుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది మంది ఓట్లు తీసివేశారని, తెలంగాణలో కూడా ఆ ప్రక్రియ కొనసాగుతోందని ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత నేటి యువతపైనే ఉందని వీసీ పేర్కొన్నారు. యువత రాజ్యాంగ విలువలను అర్థం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముందు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, డా. మంగారి రాజేందర్, అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, డా. మంగారి రాజేందర్, ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, డా. మంగారి రాజేందర్ (జింబో), ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి
డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక ఉపన్యాసం వినే ప్రేక్షకులు
రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక ఉపన్యాసం వేళ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో హాజరైన ప్రేక్షకులు

సభకు అధ్యక్షత వహించిన పుష్ప చక్రపాణి

కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆమె కార్యక్రమ ప్రాధాన్యతను వివరించి, ప్రధాన వక్త మంగారి రాజేందర్‌ను సభకు పరిచయం చేశారు. గౌరవ అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి కూడా మాట్లాడారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు తడకమల్ల వివేక్, డా. కె. రామ్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు