
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలుగు సినీ పరిశ్రమకు (Tollywood) మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత జీవీ నారాయణరావు (GV Narayana Rao) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని (Hyderabad) తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణ వార్తను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ధృవీకరించింది.
అంతులేని కథతో మొదలైన ప్రస్థానం
ఆయన పూర్తి పేరు గుల్లేపల్లి వెంకట నారాయణరావు. కృష్ణా జిల్లా కురుమద్దాలిలో జన్మించిన ఆయన గుంతకల్, హైదరాబాద్ ప్రాంతాల్లో పెరిగారు. ఆయన తండ్రి జి. ప్రసాదరావు నవయుగ స్టూడియోస్‌కు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే సారథి స్టూడియోస్‌కు ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1973లో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ తొలి బ్యాచ్‌లో ఆయన నటనలో శిక్షణ పొందారు. అదే బ్యాచ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహం ఉంది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అంతులేని కథ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి సినిమాలోనే అద్భుత నటన కనబరిచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నంది అవార్డు అందుకున్నారు. తొలి చిత్రానికే నంది అవార్డు అందుకోవడం చాలా అరుదైన విషయం.
హీరోగా, నిర్మాతగా చెరగని ముద్ర
ఆ తర్వాత ఆయన ముత్యాల పల్లకి, ఒక ఊరి కథ, చిలకమ్మ చెప్పింది లాంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లారు. తెలుగులో 100కు పైగా చిత్రాలు, అనేక టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. తన స్నేహితుడు చిరంజీవితో కలిసి చట్టానికి కళ్లు లేవు, మంచు పల్లకి, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, హిట్లర్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లినీకు శుభం నాకు వంటి హిట్ సినిమాలను ఆయన నిర్మించారు. చిరంజీవి హీరోగా వచ్చిన యముడికి మొగుడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇదే సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో రీమేక్ చేసి అక్కడ కూడా విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో ఉన్న ఆలోచన సినిమా పెండింగ్‌లో ఉంది.
ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను ముందుగా పంచుకున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అవినాష్ వ్యాపారవేత్త కాగా, కుమార్తె ఫార్మసిస్ట్‌గా లండన్‌లో స్థిరపడ్డారు. ఆమె విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలు వాయిదా వేశారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో ఉంచారు. కుటుంబ సభ్యులు నిర్ణయించిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



