
గుంటూరు, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ (YSRCP) సీనియర్ నేత అంబటి రాంబాబు పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో పార్టీ మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, పోలీసులకు ఇచ్చిన హెచ్చరికలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
మరో రెండేళ్లలో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన అంబటి రాంబాబు, ఆ తర్వాత తొలి ఆరు నెలల పాటు రాష్ట్ర హోంమంత్రిగా తానే బాధ్యతలు తీసుకుంటానని పోలీసులను ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులంతా మంచివారేనని, కానీ ఒక్కరు మాత్రం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో, పోలీసులు అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో అంబటి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, ఆయన కామెంట్లపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ, అధికారం కోల్పోయిన అసహనంతోనే హోంమంత్రి పదవికి ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



