
చెన్నై, సూర్య న్యూస్ : ప్రముఖ లెజెండరీ సింగర్ పి.సుశీల (P Susheela) జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదని తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) నిర్మాణంలో, కన్నడ నటి రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రాబోతోందని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని, చిత్ర నిర్మాణానికి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు ఈ ప్రచారానికి ప్రధాన కారణం 2021లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన. అప్పట్లో ఏఆర్ రెహమాన్ నిర్మించిన ’99 సాంగ్స్’ సినిమా చూసిన పి.సుశీల, తన జీవిత చరిత్ర కూడా ఇలాగే అద్భుతంగా తెరపైకి రావాలని ఆకాంక్షించారు. తన బయోపిక్ నిర్మాణానికి సహాయం చేయాలని ఆమె రెహమాన్‌ను కోరారు. ఆ సమయంలో ఈ విషయాన్ని స్వయంగా రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పటి ఆ పాత ముచ్చటను ఆధారంగా చేసుకుని ఇప్పుడు కొందరు బయోపిక్ తెరకెక్కుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇక ఈ బయోపిక్‌లో పి.సుశీల పాత్రలో కన్నడ భామ రుక్మిణి వసంత్ నటించనుందన్న వార్తల్లోనూ ఎలాంటి వాస్తవం లేదు. మరో ప్రముఖ దివంగత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో నటించే అవకాశం ఉందంటూ గతంలో రుక్మిణి పేరు వినిపించింది. బహుశా ఆ వార్తలను ముడిపెట్టి ఇప్పుడు పి.సుశీల బయోపిక్ అంటూ తప్పుగా ప్రచారం చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ప్రొడక్షన్లో పి.సుశీల బయోపిక్ తెరకెక్కుతున్నట్లు ఎక్కడా ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



