
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో కల్లుగీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమా (Insurance) మొత్తాన్ని రూ. 50 వేలకు పెంచాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీలో (Excise Policy) గౌడ్లకు 25 శాతం వైన్స్ షాపులు కేటాయించడంతో పాటు పలు కీలక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్ సోమవారం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఒక వినతిపత్రం విడుదల చేశారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో ఉన్న కల్లుగీత వృత్తిదారులందరికీ తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేసేలా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించాలని మల్లేష్ గౌడ్ కోరారు. అదేవిధంగా, వృత్తిదారులు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి గాయపడితే ఇచ్చే పరిహారాన్ని రూ. 25 వేలకు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని టీఎఫ్టీలను సొసైటీలుగా మార్చి గీత కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన గౌడ ఆత్మగౌరవ భవన్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భవనాలకు వచ్చే డిసెంబర్లో శంకుస్థాపన చేసి, నిర్మాణ పనుల కోసం రూ. 15 కోట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా పనులు ప్రారంభించలేదని గుర్తుచేశారు. అలాగే, గౌడ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు, ప్రతి జిల్లాకు ఇద్దరు డైరెక్టర్లను నియమించి అందులో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ యువ వికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న గౌడ యువతకు, మహిళా సొసైటీలకు తక్షణమే లోన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



