సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని వెల్లడించిన కాలభైరవ.. జీవితాంతం కలిసుంటామని తెలుపుతూ కవితాత్మక పోస్ట్

Hyderabad, Surya News: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ (Kaala Bhairava), టాలీవుడ్ నటి కావ్య కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) తో తన ప్రేమను అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, కాలభైరవ సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని వెల్లడించారు.
కావ్యతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ కాలభైరవ కవితాత్మకమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ఆమెతో గడిపే సమయం పచ్చని పర్వతాల మధ్య జలపాతాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుందని, ఆమెతో మాట్లాడే మాటలు చలికాలపు ఉదయం వేడి కాఫీలా సాంత్వన ఇస్తాయని ఆయన వర్ణించారు. చిన్న పని కలిసి చేసినా అది అందమైన విహారయాత్రలా అనిపిస్తుందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
తమ ప్రయాణంలో కావ్యపై ఉన్న భావనకు ‘ఇల్లు’ అని పేరు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. “నిన్ను మొదటిసారి కలిసినప్పుడు కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు.. ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న నా సొంత గూటికి చేరుకున్న భావన కలిగింది” అని తన మనసులోని మాటను పంచుకున్నారు. జీవితాంతం ఒకరికొకరం అండగా కలిసి ఉండబోతున్నామనే విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కావ్య కల్యాణ్‌రామ్ ‘మసూద’, ‘బలగం’ వంటి హిట్ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వీరిద్దరి ప్రేమ ప్రకటనతో సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమను ఇంతటి సున్నితమైన పదాలతో వ్యక్తీకరించడం కాలభైరవకే సాధ్యమంటూ నెటిజన్లు ప్రశంసిస్తుండటంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



