
హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) వేడుకలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి పర్వదినం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున తమ ఇళ్లలో బాల గోపాలుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు (Fasting Rules) ఆచరిస్తారు. అయితే కన్నయ్య ఆరాధనలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు సూచిస్తున్నారు. పూజా సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూల దండల విషయంలో జాగ్రత్త
బాల గోపాలుడి పూజకు ఉపయోగించే పూల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జన్మాష్టమి రోజున రాత్రి నిద్రపోయే ముందు కన్నయ్యకు వేసిన పూలదండను తప్పకుండా తీసివేయాలి. ఒకవేళ మర్చిపోయి మరుసటి రోజు తీస్తే పూజా ఫలితం దక్కకపోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించలేదని అర్థం వస్తుందని స్పష్టం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆర్భాటం వద్దు
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చాలామంది బాల గోపాలుడి అలంకరణలు, సేవలను ఫోటోలు తీసి నెట్టింట షేర్ చేస్తుంటారు. అయితే భక్తి భావాలను బహిరంగపరచడం అహంకారానికి దారి తీస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవుడికి నైవేద్యం సమర్పించడం లాంటివి భక్తిని పెంచుతాయి కానీ వాటిని ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. భగవంతుడితో ఉండే భక్తి భావాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి.
ఈ పనులు అస్సలు చేయకూడదు
విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన తులసి మొక్క నుంచి జన్మాష్టమి రోజున ఆకులు తెంపకూడదు. అలాగే చెట్లను నరకడం, జంతువులకు హాని చేయడం లాంటివి చేస్తే అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పండుగ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. మాంసం, మద్యం లాంటి వాటికి దూరంగా ఉంటూ కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. పండుగ పూట బ్రహ్మచర్యం పాటించడం అత్యంత ముఖ్యం.

ఉపవాస దీక్ష ఎలా చేయాలంటే
కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఉండే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి దీపం వెలిగించిన తర్వాత ఉపవాస ప్రమాణం చేయాలి. రోజంతా కృష్ణుడిని స్మరిస్తూ పూజలో నెమలి ఈక, వెన్న, పాలు సమర్పించాలి. ఉపవాసం ఉండే వారు పండ్లను మాత్రమే తీసుకుంటూ మరుసటి రోజు సూర్యోదయం తర్వాతే దీక్ష విరమించాలి. శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు దానధర్మాలు చేయాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం, నియమాలు కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించగలరు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



