
హైదరాబాద్, సూర్య న్యూస్ : నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195ను తీసుకురావడం తీవ్ర అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆదివారం బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఎన్హెచ్ఎం (National Health Mission) జేఏసీ నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం దారుణమని ఆమె విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఉండగా, వారిలో కొంతమంది వేతనాలను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తగ్గించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి జీతాలు పెంచి, మరికొందరి వేతనాలు తగ్గించడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిదర్శనమని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం ఉద్యోగుల వేతనాల కోసం నిధులు ఇస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోందని, సమయానికి జీతాలు కూడా చెల్లించడం లేదని ఆమె విమర్శించారు.
రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, అందులో కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ కూడా ఉందన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో కూడా 30 శాతం వేతనాలు పెంచుతూ, రెగ్యులరైజేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆమె గుర్తు చేశారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వేతనాలు పెంచాల్సి ఉండగా, తగ్గించడం ఎన్హెచ్ఎం ఉద్యోగుల శ్రమను దోచుకోవడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమం
గ్రామీణ వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, వారు ఒక్కరోజు విధులకు దూరమైనా ఆ వ్యవస్థ దెబ్బతింటుందని కవిత హెచ్చరించారు. వేతనాల తగ్గింపుపై నిరసన తెలిపేందుకు ఉద్యోగులకు కనీసం అనుమతి కూడా ఇవ్వడం లేదని, ఆరోగ్య శాఖ మంత్రి వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని ఆమె కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారి పక్షాన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



