
అమరావతి, సూర్య న్యూస్ : తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu) ఆహ్వానించడంపై సాక్షి దినపత్రిక (Sakshi) రాసిన కథనాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా తప్పుబట్టారు. ‘బాబుతో చెట్టాపట్టాల్!.. సీఎం చంద్రబాబుతో షర్మిల ఆత్మీయ సంబంధాలు!’ అనే శీర్షికతో మంగళవారం వచ్చిన ఈ కథనం తనపై, తన కుటుంబంపై జరిగిన వ్యక్తిత్వ హననమని ఆమె మండిపడ్డారు. తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కుటుంబానికి చెందిన పత్రికలోనే ఈ కథనం రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏం జరిగింది?
షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం త్వరలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ ఈ నెల 15న షర్మిల స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి శుభలేఖ అందించారు. ఈ విషయాన్ని ఆమె అదే రోజు సామాజిక మాధ్యమంలో ఫోటోతో సహా పంచుకున్నారు. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలుస్తున్నారని, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసే షర్మిల చంద్రబాబు విషయంలో మాత్రం స్నేహపూర్వకంగా ఉంటున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ‘చంద్రబాబుతో ఎందుకంత ఆత్మీయత?’, ‘తనను తిట్టినవారితోనే చెలిమా?’ అంటూ ఉపశీర్షికలతో ప్రశ్నలు సంధించారు.
‘తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే..’
ఈ కథనంపై షర్మిల మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా ఘాటుగా స్పందించారు. “తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? ఇది వావి వరసలు తెలిసినవారు చేసే పనేనా? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా?” అని ఆమె ప్రశ్నించారు. ఈ కథనం తీవ్ర అభ్యంతరకరమని, తల్లి, చెల్లి అనే తేడా లేకుండా రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేనని ఎద్దేవా చేశారు.
‘నాన్న కూడా చంద్రబాబును పిలిచారు’
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తన బిడ్డల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారని షర్మిల గుర్తుచేశారు. “అంటే ఆయన కూడా చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగినట్లా? బాబు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వదిస్తే వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా?” అని ఆమె నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కుమార్తె పెళ్లికి పిలవడంలో తప్పుడు అర్థాలు వెతకడం వారి ఆలోచనా విధానాన్ని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.
జగన్ సమాధానం చెప్పాలి
అక్కచెల్లెమ్మలపై అమితమైన ప్రేమ ఉందని చెప్పే జగన్ తన పత్రికలో ఇలాంటి వార్తను ఎలా సమర్థించుకుంటారని షర్మిల ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డపై నీలాపనిందలు వేయడమే పత్రిక విధానమా అని నిలదీశారు. ఈ కథనాన్ని జగన్ దగ్గరుండి రాయించారా అన్నదానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాతలకు సంజాయిషీ జగనే ఇస్తారా, లేక సాక్షితో ఇప్పిస్తారా అన్నది తేల్చుకోవాలని స్పష్టం చేశారు.
ఆడబిడ్డ గౌరవంపై దాడి తగదు
రాజకీయ విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నా, కుమార్తె పెళ్లికి పెద్దలను ఆహ్వానించడం తెలుగు సంప్రదాయంలో సహజమైన విషయం. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను శుభకార్యాలకు పిలవడం రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. అలాంటి కుటుంబ వేడుక ఆహ్వానానికి వ్యక్తిగత సంబంధాలను అంటగట్టేలా రాయడం ఒక మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదేనని, ఇలాంటి రాతలను ఎవరైనా ఖండించాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ విభేదాలు ఇప్పుడు ఈ స్థాయికి చేరడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



