Hyderabad, Surya News: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG Re-exam) రాసిన విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు (OMR Sheets), రికార్డ్ చేసిన రెస్పాన్స్ షీట్లను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెలలోనే ఈ పరీక్ష ప్రాథమిక కీ (Preliminary Key) విడుదలైన విషయం తెలిసిందే.

విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ (Captcha Code) ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా వీటిని చూసుకోవచ్చు. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు ముగిసింది. తాజాగా ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే లేవనెత్తేందుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
అభ్యంతరాలు తెలపడానికి ఎన్టీఏ (NTA) ఒక విండోను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ. 200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ అవకాశం జులై 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ విద్యార్థి లేవనెత్తిన సందేహం సరైందే అయితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఓఎంఆర్ షీట్లు లేదా ఇతర అంశాలపై ఏవైనా సందేహాలుంటే విద్యార్థులు అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. 011-40759000 లేదా 011-69227700 ఫోన్ నంబర్లలో కాల్ చేయవచ్చు. అలాగే neetug2026@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా కూడా అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.
తొలుత నీట్ యూజీ (NEET UG) పరీక్షను మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ (Paper Leak) అవ్వడంతో జూన్ 21న మరోసారి దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




