
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య తొలిసారిగా సెప్టెంబర్ 22న చారిత్రక టీ20 మ్యాచ్ (India vs Japan T20) జరగనుంది. జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ (Japan Captain) భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీని చూసి తమ జట్టుకు ఎలాంటి భయం లేదని, అతని దూకుడుకు కళ్లెం వేసే అస్త్రం తమ వద్ద సిద్ధంగా ఉందని కెండెల్ ధీమా వ్యక్తం చేశాడు. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో తమ పదిహేనేళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ చార్లీ హరా ఇప్పటికే వైభవ్‌ను అవుట్ చేశాడని, కాబట్టి అతడిని ఎదుర్కోవడం తమకు పెద్ద కష్టం కాదని పేర్కొన్నాడు. ఆసియా కప్-2024లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఇబ్బంది పడ్డాడని, 23 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులు మాత్రమే చేసి చార్లీ హరా బౌలింగ్‌లో ఎనిమిదో ఓవర్లో పెవిలియన్ చేరాడని గుర్తుచేశాడు.
స్పిన్నర్లపై అద్భుత రికార్డు
జపాన్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లలో 146 బంతులు ఆడిన వైభవ్ ఏకంగా 336 పరుగులు సాధించాడు. సగటు 37 కాగా, ఇందులో 20 ఫోర్లు, 34 సిక్సర్లు ఉండటం విశేషం. స్పిన్నర్లపై ఇతడి స్ట్రైక్ రేట్ 228.08 గా నమోదైంది. మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన పదిహేనేళ్ల వైభవ్ రెండు అర్ధ శతకాలతో 193 పరుగులు సాధించాడు.
అలాగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 23 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 1028 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే తొలి టీ20లో సంజూ శాంసన్ జట్టులోకి రావడం వల్ల వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



