
సూర్య న్యూస్ డెస్క్ : సౌదీ అరేబియా (Saudi Arabia) రాజధాని రియాద్‌పై హౌతీ రెబల్స్ (Houthi Rebels) డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీకి సైనిక మద్దతుగా వస్తే పాకిస్థాన్, తుర్కియే దేశాలపై కూడా ప్రతీకార దాడులు చేస్తామని హౌతీ మిలిటెంట్లు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
సౌదీ రాజధాని రియాద్ లక్ష్యంగా తాము బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు అధికారికంగా ప్రకటించారు. ఈ దాడుల కారణంగా ప్రముఖ ఆయిల్ సంస్థ అరామ్కో కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తాము విజయవంతంగా కూల్చేశామని సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాలతో మక్కా ఒప్పందంలో భాగంగా సౌదీకి అవసరమైన సైనిక మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తుర్కియే ప్రకటించింది.
పాకిస్థాన్, తుర్కియేలకు హౌతీల వార్నింగ్
సౌదీ అరేబియా వ్యవహారంలో ఇతర దేశాలు సైనికంగా జోక్యం చేసుకోవద్దని హౌతీలు స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్, తుర్కియే దేశాలు తమ బలగాలను మోహరిస్తే.. ఆ దేశాలపై కూడా కచ్చితంగా ప్రతీకార దాడులకు దిగుతామని హెచ్చరించారు. పాక్, తుర్కియే మధ్యలోకి వస్తే ఉక్కు పిడికిలితో అణచివేస్తామని, వారికి తగిన గుణపాఠం చెబుతామని హౌతీల ఆధ్వర్యంలోని ధమర్ గవర్నర్ మహ్మద్ అల్ బుఖైటి తేల్చిచెప్పారు. వరుస దాడులు, హెచ్చరికల నేపథ్యంలో ఈ వివాదం పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



