
హైదరాబాద్, సూర్య న్యూస్ : నగర ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేస్తూ టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC), హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) సంయుక్తంగా కామన్ పాస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇకపై ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లలో ఒకే పాస్‌తో ప్రయాణించే సదుపాయం ఇవాల్టి నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది.
పాస్‌ల ఛార్జీల వివరాలు
ఈ కామన్ పాస్‌లకు సంబంధించిన ఛార్జీల వివరాలను అధికారులు వెల్లడించారు. రోజువారీ కామన్ పాస్ ధరను రూ. 400గా నిర్ణయించారు. విడిగా చూసుకుంటే మెట్రో రోజువారీ పాస్ ధర రూ. 300, ఆర్టీసీ పాస్ రూ. 400గా ఉంది. అలాగే నెలవారీ కామన్ పాస్ ధరను రూ. 8,500గా నిర్ధారించారు. ఇందులో మెట్రో నెలవారీ ఛార్జి రూ. 7,000 కాగా, ఆర్టీసీకి రూ. 1,500గా నిర్ణయించారు. ఈ కామన్ పాస్‌లతో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల తిరిగే అన్ని రకాల బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఎలాంటి ఆటంకం లేకుండా జర్నీ చేయవచ్చు.
సిటీ బస్సులకు వారం పాస్
కామన్ పాస్‌లతో పాటు ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో సరికొత్త సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు. కేవలం రూ. 600 చెల్లించి నగరంలోని సిటీ బస్సుల్లో వారం రోజుల పాటు అన్‌లిమిటెడ్‌గా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ పాస్‌లను సులభంగా పొందేందుకు వీలుగా ‘మీ టికెట్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఈరోజు లాంచ్ చేయనున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



