
అమరావతి, సూర్య న్యూస్ : మురసు తీవ్ర తుఫాను (Cyclone Murasu) కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ (R&B) పరిధిలోని 1,302 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా బాపట్ల జిల్లాలో 332 కి.మీ., గుంటూరులో 266 కి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 202 కి.మీ. మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు మంత్రి తెలిపారు. వీటితో పాటు పశ్చిమగోదావరిలో 122 కి.మీ., పల్నాడులో 93 కి.మీ., ఏలూరులో 75 కి.మీ., తూర్పుగోదావరిలో 68 కి.మీ., నెల్లూరులో 66 కి.మీ., కృష్ణాలో 59 కి.మీ., ప్రకాశం జిల్లాలో 17 కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం వాటిల్లిందని వివరించారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
రాష్ట్రవ్యాప్తంగా 158 చోట్ల రహదారులు కోతకు గురికాగా, ఇప్పటికే 141 చోట్ల మరమ్మతులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించామని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. 31 చోట్ల రోడ్లు కొట్టుకుపోగా 30 చోట్ల, 60 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతినగా 58 చోట్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రహదారులపై 207 చోట్ల నేలకూలిన చెట్లను పూర్తిగా తొలగించామని, భారీ వర్షాలకు 120 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా 116 ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించామని చెప్పారు. అయితే వరద ఉద్ధృతి కారణంగా తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.
రహదారుల నిర్మాణానికి రూ.870.90 కోట్లు
తుఫాను కారణంగా దెబ్బతిన్న రహదారులకు సంబంధించి తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం రూ.98.70 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే శాశ్వత ప్రాతిపదికన రోడ్ల నిర్మాణానికి రూ.772.22 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. మొత్తంగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని రహదారుల పూర్తిస్థాయి పునరుద్ధరణకు రూ.870.90 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



