
కరీంనగర్, సూర్య న్యూస్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భవానీ దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం కరీంనగర్‌లోని చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయంలో (Sri Mahashakti Temple) వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన భక్తిశ్రద్ధలతో అమ్మవారి మాలాధారణ స్వీకరించారు.
దీక్షలో భాగంగా ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు నిండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షా కాలమంతా ఆయన ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో గడపనున్నారు. దీక్షా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, వివిధ సమస్యలపై వినతులు సమర్పించేందుకు వచ్చే వారి కోసం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఒక టెంట్ ఏర్పాటు చేశారు.
మరోవైపు నవరాత్రి ఉత్సవాల వేళ మహాశక్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా భవానీ మాలధారులు, యువత పెద్ద సంఖ్యలో దీక్షలు స్వీకరిస్తున్నారు. గత 16 ఏళ్లుగా ఈ ఆలయంలో దీక్షలు స్వీకరిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లతో పాటు ఉచితంగా ప్రసాదాలు, భోజన వసతులను ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



