
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ఉన్నత విద్యా రంగంలో సరికొత్త మానవతా విప్లవానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన ‘సమతా ఫ్రీషిప్’ (Samatha Freeship) పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఉచిత ఉన్నత విద్యా పథకం కారణంగా ఈ విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.
గత విద్యా సంవత్సరంలో అన్ని కోర్సుల్లో కలిపి 51,564 మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరం ఆ సంఖ్య 56,180కి పెరిగింది. ఈ పథకం కింద విద్యార్థులు కేవలం రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని వర్సిటీ పూర్తిగా మాఫీ చేస్తోంది. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఆడియో, వీడియో పాఠాలను కూడా అందిస్తూ ఆయా వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోంది.
అట్టడుగు వర్గాలకు ఉచిత ఉన్నత విద్య
తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 516 మంది ఆదివాసీ విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరారు. తెలంగాణ అడవుల్లోని గోండు, కోయ, చెంచు, కొండరెడ్లు వంటి ఆదిమ తెగలకు చెందిన వారు తమ గూడెలకు సమీపంలోని స్టడీ సెంటర్ల ద్వారా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. అలాగే, సమాజంలో నిత్యం వివక్షను ఎదుర్కొంటున్న నలుగురు ట్రాన్స్జెండర్లు, వైకల్యాన్ని సైతం అధిగమించి 146 మంది దివ్యాంగులు ఈ పథకం ద్వారా అడ్మిషన్లు పొందడం విశేషం. పన్నెండవ తరగతి అర్హత ఉన్న ఏ ట్రాన్స్జెండర్ అయినా ఈ ఉచిత విద్యను పొందవచ్చని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
చదువు దయ కాదు.. హక్కు: వీసీ ఘంటా చక్రపాణి
సమతా ఫ్రీషిప్ ద్వారా పెరిగిన అడ్మిషన్లపై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం అడ్మిషన్ల సంఖ్య కాదని, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. విద్య అనేది ఎవరి దయ కాదని, అది ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో కనీసం వెయ్యి మంది ఆదివాసీ, ట్రాన్స్జెండర్, దివ్యాంగ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే వర్సిటీ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రవేశాలు, ఇతర వివరాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 18005990101 ను సంప్రదించవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



