
గుమ్మడిదల (సూర్య న్యూస్):పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించి, ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి జి.ఎస్.ఎన్ ఫంక్షన్ హాల్‌లో గుమ్మడిదల, జిన్నారం, బొల్లారం మండలాల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమైన మలుపు అని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి పరీక్షలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా తన సొంత నిధులతో ప్రముఖ నిపుణులచే మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటేనే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని హితవు పలికారు. అనంతరం పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామాగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీవో శారద, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏజాజ్ అహ్మద్, మండల విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.