|  
● FLASH NEWS
ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  •  MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!  •  PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  • 
Skip to content

MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!

హైదరాబాద్, సూర్య న్యూస్ : కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతోంది. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Election) అభ్యర్థిగా కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం దసరా పండుగ వేళ అధికారికంగా ప్రకటించింది. కడు పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓ బహుజన బిడ్డకు అవకాశం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి అనే మారుమూల గ్రామంలో సామాన్య గౌడ కుటుంబంలో శ్రీమతి అరుణ, శ్రీ యాకయ్య దంపతులకు శ్రీకాంత్ గౌడ్ జన్మించారు. తండ్రి వృత్తి రీత్యా అమ్మమ్మ ఊరైన ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో వీరి కుటుంబం స్థిరపడింది. వర్షం వస్తే కారిపోయే తాటికమ్మల గుడిసెలో ఉంటూ, సద్ది కట్టుకుని నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తండ్రి రెండు రోజులు కల్లు గీసి అమ్మితే గానీ బస్సు పాస్‌కు డబ్బులు జమకాని కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు.

కౌసల్యాదేవిపల్లి, చిన్ననాగారం, ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను, జమాండ్లపల్లి విద్యాభారతి గురుకులంలో పదో తరగతి వరకు చదివారు. మహబూబాబాద్ విజ్ఞాన భారతి కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, కొంతకాలం నెల్లికుదురులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తి చేశారు. ప్రొఫెసర్ టి. దయాకర్ రావు పర్యవేక్షణలో పర్యాటక రంగంపై పరిశోధన చేసి 2016లో కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా అందుకున్నారు.

ఇంటర్ దశలో ఎస్ఎఫ్ఐ, డిగ్రీలో టీఆర్ఎస్వీలో పనిచేసిన శ్రీకాంత్ గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడిగా విద్యార్థి సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కాకతీయ గడ్డపై 9 రోజుల పాటు అన్నపానీయాలు ముట్టకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినా, జైలులో సైతం తన దీక్షను కొనసాగించి చరిత్ర సృష్టించారు.

శ్రీకాంత్ గౌడ్ పోరాట పటిమను గుర్తించిన కల్వకుంట్ల కవిత ఆయన్ను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు. నాడు వరంగల్ ఏకశిలా పార్క్ వద్ద 10 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ, ‘విద్యార్థి పోరు సభ’ నిర్వహించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాగృతికి బలమైన పునాది వేశారు. 12 నియోజకవర్గాల్లో కమిటీలు వేసి, తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య (TJSF)ను ప్రధాన సంఘాల సరసన నిలిపారు. కాకతీయ యూనివర్సిటీ టీఎస్ జేఏసీ కో-ఆర్డినేటర్‌గానూ సేవలందించారు. ఇదే క్రమంలో యూనివర్సిటీలో సహచర పరిశోధకురాలిగా, ఉద్యమకారిణిగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మారిపెల్లి శ్వేతను పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి సుదీక్ష (బబ్లీ) అనే కుమార్తె ఉంది.

2014 ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టి, 100 మంది అనుచరులతో క్షేత్రస్థాయిలో శ్రమించి 45 వేల అత్యధిక మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరును మెచ్చిన కవిత రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడంతో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్ట్‌టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తన సతీమణి శ్వేత ఉద్యోగాన్ని సైతం వదులుకుని సంస్థ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు.

జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా, నిజామాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా సంస్థను బలోపేతం చేసిన శ్రీకాంత్ గౌడ్‌కు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పదవులు దక్కకపోయినా నిబద్ధతతో పనిచేశారు. కల్వకుంట్ల కవిత రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, పదవులు అనుభవించిన నేతలు పక్కకు తప్పుకున్నా శ్రీకాంత్ గౌడ్ మాత్రం వెన్నుచూపలేదు. ఫ్రంట్‌లైన్ వారియర్‌గా నిలబడి, తన పదునైన వాగ్ధాటితో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ కవితకు కొండంత అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం, నాయకురాలి కోసం నిలబడిన ఆయన విశ్వాసానికి గుర్తింపుగా నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కింది.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రశ్నిస్తానని చెప్పి స్వప్రయోజనాల కోసం పాలకులకు దాసోహమైన తీన్మార్ మల్లన్నను, ఓట్లు దండుకుని వేల కోట్ల ప్రైవేట్ యూనివర్సిటీల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రులు గమనించాలని కోరారు. ప్రభుత్వ వర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ వర్సిటీలకు కొమ్ముకాస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పేపర్ లీకేజీలు, జీవోల గందరగోళం, జాబ్ క్యాలెండర్ పేరుతో దగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ప్రభుత్వాలను నిలదీస్తానని స్పష్టం చేశారు.

కల్వకుంట్ల కవిత పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చి రోహిత్ వేముల చట్టంపై కమిటీ వేసిందని, ఆదిలాబాద్ రిమ్స్‌కు రూ. 11 కోట్ల నిధులు విడుదల చేసిందని, పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. సొంత ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబం నుంచి, యూనివర్సిటీ హాస్టల్ నుంచి వచ్చిన తనకు నిరుద్యోగుల బాధలు, పేదరికపు కష్టాలు పూర్తిగా తెలుసని తెలిపారు. బహుజన, ప్రజాస్వామిక వాదులు, నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై తనను ఆశీర్వదిస్తే చట్టసభలో పట్టభద్రుల గొంతుకనై దిక్కులు పిక్కటిల్లేలా పోరాడుతానని శ్రీకాంత్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp