
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : దేశ రాజధానిలోని సుప్రసిద్ధ జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఇకపై ఎలాంటి ఆందోళనలు, ధర్నాలకు (Protests) అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీజేపీ, ప్రతిపక్ష నేతల నిరసనల నేపథ్యంలో ఈ చారిత్రక ప్రాంతంలో ధర్నాలను పూర్తిగా నిషేధిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనలను బ్యాన్ చేసిన పోలీసులు.. ఆందోళనకారుల కోసం ప్రత్యామ్నాయ వేదికలను సూచించారు. ఇకపై ఎవరైనా నిరసనలు తెలపాలనుకుంటే రామ్‌లీలా మైదాన్, సీబీడీ గ్రౌండ్, బురాడీ గ్రౌండ్ వంటి ప్రాంతాల్లో మాత్రమే చేసుకోవాలని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ వేదికపై నిరసనలు రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మోదీ ఒక పిరికి నియంత
ఢిల్లీ పోలీసుల నిర్ణయంపై సీజేపీ చీఫ్ అభిజీత్ డిప్కే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జంతర్ మంతర్‌ను ధర్నా వేదిక కాకుండా చేసి, దానిని యుద్ధ భూమిగా మార్చేశారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఒక పిరికి నియంత అని, ప్రజలు నిరసన తెలపడమన్న ఆలోచనే ఆయనకు పెద్ద సమస్యగా మారిందని ఎక్స్ వేదికగా వరుస పోస్టులు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం జంతర్ మంతర్‌గా మారుతుందని, రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేస్తారంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంతర్ మంతర్‌కు 300 ఏళ్ల చరిత్ర
దశాబ్దాలుగా నిరసనల వేదికగా పేరుగాంచిన జంతర్ మంతర్‌కు దాదాపు 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. 1724లో జైపూర్ మహారాజు సవాయ్ జై సింగ్ II ఢిల్లీతో సహా దేశంలోని ఐదు ప్రాంతాల్లో ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (గణన లేదా సూత్రం) అనే పదాల కలయికతో దీనికి జంతర్ మంతర్ అనే పేరు వచ్చింది. పార్లమెంటుకు అత్యంత సమీపంలో ఉండటంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు తమ డిమాండ్ల సాధన కోసం ఇక్కడే నిరసనలు తెలుపుతూ వచ్చాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



