
ఢిల్లీ, సూర్య న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల నిరసనలు, అరెస్టుల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సీజేపి (CJP Leaders) నేతలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ పరిణామాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ, అరెస్టుకు గురైన యువ నేతలకు తన పూర్తి మద్దతును ప్రకటించారు.
సీజేపి నేతలకు ఐదు రోజుల రిమాండ్
జంతర్ మంతర్ వద్ద విధించిన ఆంక్షలను దాటుకుని వెళ్లి ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తదితరులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. గేట్లు దూకి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న వీరు, ఓ ఇంట్లో నుంచి అనుమతి లేకుండా వెళ్లినందుకు గాను కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నేతలను ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి ఐదు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా, ఈ నెల 10వ తేదీన తొలిసారి అరెస్టైన వీరిని, మరుసటి రోజు జడ్జి కండిషన్పై విడుదల చేయడం గమనార్హం.
జంతర్ మంతర్పై ఆంక్షలు
సీజేపి మరియు విపక్ష నేతల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా ధర్నాలకు ప్రధాన వేదికగా ఉన్న జంతర్ మంతర్ హోదాను రద్దు చేస్తూ, అక్కడ ఎటువంటి నిరసనలు, ధర్నాలు చేయకూడదని బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆందోళనలు, ధర్నాలు చేసుకోవడానికి ఇకపై రామ్లీలా మైదాన్, సీబీడీ గ్రౌండ్, బురాడీ గ్రౌండ్లను ప్రత్యామ్నాయ వేదికలుగా సూచించారు.
దేశంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం
సీజేపి నేతల అరెస్టులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్న యువతను అరెస్టు చేయడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన సౌరవ్, అశుతోష్లపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టడం దారుణమన్న ఆయన, కేంద్రం దేశంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణాన్ని నెలకొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని కేటీఆర్ గుర్తుచేశారు.
సీజేపి నేతల అరెస్టుపై తాను మాట్లాడినందుకు అభిజీత్ డీపీ అనే వ్యక్తి కృతజ్ఞతలు తెలుపగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘మనమందరం ఒకే మార్గంలో వెళ్తున్నాం సోదరా.. మెరుగైన భారతదేశం కోసం పోరాడుదాం.. జైహింద్’ అంటూ యువత పోరాటానికి ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



