
వాషింగ్టన్, సూర్య న్యూస్ డెస్క్ : ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రష్యాను ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ (FT) రిపోర్ట్ ప్రకారం.. పాశ్చాత్య దేశాలు ఫ్రీజ్ చేసిన రష్యా (Russia) ఆస్తుల్లో కొంత భాగాన్ని అన్‌ఫ్రీజ్ చేసి, వాషింగ్టన్ నియంత్రణలోని ఒక సంస్థకు బదిలీ చేయాలని ట్రంప్ బృందం ప్రతిపాదించినట్లు సమాచారం.
కుష్నర్, విట్కాఫ్ల రాయబారం
2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పుడు, పాశ్చాత్య దేశాలు సుమారు 260 బిలియన్ యూరోల రష్యా ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. వీటిలో సింహభాగం బెల్జియంలోని యూరోక్లియర్ సహా యూరప్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కొంత భాగాన్ని అన్‌ఫ్రీజ్ చేసి అమెరికా సంస్థకు బదిలీ చేయడం ద్వారా రష్యాకు ఆర్థిక ప్రోత్సాహకం కల్పించాలన్నది ట్రంప్ బృందం ఆలోచన. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లు ఈ ప్రతిపాదనను సిద్ధం చేసి, అక్టోబర్ 9-10 తేదీల్లో మయామిలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఈయూ, నాటో ప్రతినిధుల ముందు ఉంచినట్లు ఎఫ్టీ నివేదించింది. అంతకుముందు మిడిల్ ఈస్ట్ ఇన్వెస్టర్లకు లుకోయిల్ వాటాల విక్రయం, బెలారస్ పొటాష్ ఎగుమతుల సడలింపు వంటి ఎరలను కూడా వీరు రష్యా ముందు ఉంచారు.
ససేమిరా అంటున్న యూరప్
ట్రంప్ బృందం ప్రతిపాదనను యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రీజ్ చేసిన రష్యా ఆస్తులపై తమ నియంత్రణను వదులుకునే ప్రసక్తే లేదని, వాటిని తిరిగి మాస్కోకు చేర్చే ఆలోచనలకు అంగీకరించబోమని స్పష్టం చేశాయి. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సైతం ఈ ఆస్తులు యూరప్‌లోనే ఫ్రీజ్‌లో ఉండాలని కరాఖండిగా తేల్చిచెప్పారు.
పుతిన్‌తో డీజిల్ డీల్.. జెలెన్స్కీ ఫైర్
మరోవైపు, అమెరికాలో ఇంధన ధరల పెరుగుదల, మధ్యంతర ఎన్నికల (మిడ్‌టర్మ్ ఎలక్షన్స్) నేపథ్యంలో ట్రంప్ నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడి డీజిల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా తక్షణమే 3 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేసేలా, 2027 ఏప్రిల్ వరకు ఆంక్షల నుంచి మినహాయింపునిస్తూ లైసెన్స్ మంజూరు చేశారు. ఈ పరిణామంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇండియా లాంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినప్పుడు తీవ్రంగా స్పందించిన అమెరికా, ఇప్పుడు తన దేశీయ అవసరాల కోసం స్వయంగా డీజిల్ కొనుగోలు చేస్తుండటం పట్ల అంతర్జాతీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



