
మంగళగిరి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and Order) పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. మంగళగిరిలో సోమవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీలు, సోషల్ మీడియా సైకోల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
తాను ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా ఉంటానని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి వాతావరణం నెలకొంటే పరిశ్రమలు, పెట్టుబడిదారులు వచ్చేందుకు ఆసక్తి చూపరని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే రౌడీ మూకల తాట తీయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ వికృతానందం పొందే సోషల్ మీడియా సైకోలను సైతం ఏమాత్రం వదిలిపెట్టవద్దని పోలీసులకు ముఖ్యమంత్రి సూచించారు. జరిగిన నేరాన్ని ఛేదించడం పోలీసుల సమర్థతను చాటితే, అసలు నేరమే జరగకుండా ముందస్తుగా నివారించడం బెస్ట్ పోలీసింగ్‌కు నిదర్శనమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



