|  
● FLASH NEWS
Ramayana: పుష్ప-2ను వెనక్కి నెట్టి టాప్-4లోకి.. బాహుబలి-2కు ఇక రూ.11 కోట్లే!  •  Bhogi: శర్వానంద్ శ్రమకు ప్రశంసలు.. రక్తపాతంపై విమర్శలు! థియేటర్లలోకి ‘భోగి’, తొలిరోజు టాక్ ఇదే  •  Captain: మూడేళ్ల తర్వాత మళ్లీ రోహిత్ చేతికే ముంబయి పగ్గాలు.. అదే తేదీ, ‘45’ సమయానికి ప్రకటన!  •  Delimitation: ప్రతి రాష్ట్రానికీ 50% అదనపు ఎంపీ సీట్లు.. 2051 వరకు వాటా పదిలం!  •  Kokapet: ఎకరం రూ.120 కోట్లు.. ఒక్క బిడ్డూ రాలేదు! నియోపోలిస్, మూసాపేట భూముల వేలం రద్దు  •  Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. ఏడాదిలో మరో 25 వేల సర్కారీ కొలువులు  • 
Skip to content

Polavaram: నిర్మాణ దశలోనే డ్యామ్ భద్రతపై NDSA నజర్.. తొలిసారి ప్రాజెక్టు పరిశీలన

పోలవరం, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌ కీలక సాగునీటి ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనుల భద్రతపై జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (NDSA) ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టును ఆ సంస్థ ప్రతినిధుల బృందం తొలిసారిగా సందర్శించి, కీలక నిర్మాణ విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఆనకట్ట భద్రతకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, నిర్మాణ సమయంలో అనుసరిస్తున్న ప్రమాణాలు, భవిష్యత్తులో అమలు చేయనున్న పర్యవేక్షణ వ్యవస్థలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది.

స్పిల్‌వే, గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రాంతాల్లో తనిఖీ

ఎన్‌డీఎస్‌ఏ దక్షిణ ప్రాంత డైరెక్టర్‌ ఆర్‌. గిరిధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ బి. హేమాదిత్యతో కూడిన బృందం శనివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. తొలుత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. ప్రాజెక్టు నమూనా, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నిర్మాణ పనుల పురోగతి, పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న విభాగాల వివరాలను అధికారులు బృందానికి వివరించారు. సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ పి. రామచంద్రరావు విభాగాల వారీగా పనుల స్థితిగతులను తెలియజేశారు.

అనంతరం బృందం స్పిల్‌వే, గ్యాప్‌-1, గ్యాప్‌-2, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ECRF) డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భద్రత కోసం తీసుకున్న చర్యలు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పరికరాలు, వాటి ద్వారా సేకరిస్తున్న డేటా గురించి అధికారులు వివరించారు. నిర్మాణాల స్థితి, పనితీరును అంచనా వేయడానికి ఈ పరికరాలు ఎలా ఉపయోగపడుతున్నాయనే అంశాలపై ఎన్‌డీఎస్‌ఏ ప్రతినిధులు ఆరా తీశారు.

నిరంతర పర్యవేక్షణకు SCADA వ్యవస్థ

ప్రాజెక్టు భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (SCADA) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. సెన్సార్లు, మీటర్లు, వాల్వులు తదితర పరికరాల నుంచి రియల్‌టైమ్‌ సమాచారాన్ని ఈ వ్యవస్థ సేకరిస్తుందని వివరించారు. తద్వారా కీలక నిర్మాణాల పనితీరును నిరంతరం గమనించడంతో పాటు, ఏవైనా అసాధారణ మార్పులు చోటుచేసుకుంటే గుర్తించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.

IIT రూర్కీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంభవించే అవకాశం ఉన్న అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌ (EAP) రూపొందిస్తున్నట్లు అధికారులు బృందానికి వివరించారు. ఈ ప్రణాళిక తయారీ బాధ్యతను ఐఐటీ రూర్కీ చేపట్టిందని, పూర్తయిన అనంతరం పరిశీలన కోసం ఎన్‌డీఎస్‌ఏకు సమర్పిస్తామని తెలిపారు. సమీక్షలో భద్రతా చర్యలు, పర్యవేక్షణ ఏర్పాట్లపై అధికారులు ఇచ్చిన వివరాల పట్ల ఎన్‌డీఎస్‌ఏ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.

డ్యామ్‌ సేఫ్టీ చట్టం–2021 ప్రకారం దేశంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించి మార్గదర్శకాలు, సిఫారసులు చేయడం ఎన్‌డీఎస్‌ఏ బాధ్యత. సాధారణంగా పూర్తయిన ఆనకట్టల భద్రతపై తనిఖీలు నిర్వహించే ఈ జాతీయ సంస్థ, పోలవరం వంటి నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టును పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో జలవనరుల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు