రిపోర్టర్: ravi kumar

సంప్రదాయ వస్త్రధారణతోనే అప్పన్న దర్శనానికి రావాలి భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలి ఇఓజల్లేపల్లి వెంకట్రావు
విశాఖపట్నం, సూర్య న్యూస్ :
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్న సంప్రదాయ వస్త్రధారణ (డ్రెస్ కోడ్) నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు. నిర్ణయించిన తేదీ నుంచి డ్రెస్ కోడ్ నిబంధనలు తప్పనిసరిగా అమల్లోకి వస్తాయని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు దేవస్థానం నిర్దేశించిన సంప్రదాయ వస్త్రధారణతోనే రావాలని ఆయన తెలిపారు.డ్రెస్ కోడ్ అమలుపై ఇప్పటికే ఆలయ పరిసరాల్లో అవగాహన బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించామని ఈఓ పేర్కొన్నారు. భక్తులకు ముందస్తు అవగాహన కల్పించేందుకు దేవస్థానం అన్ని విధాలా చర్యలు చేపట్టిన నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి నిబంధనల అమలులో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. భక్తులు గమనించగలరు
పురుష భక్తులు ధోతీ–అంగవస్త్రం, కుర్తా–పైజామా లేదా సంప్రదాయబద్ధమైన ఫార్మల్ షర్ట్, ప్యాంట్ ధరించి దర్శనానికి రావచ్చు. మహిళా భక్తులు చీర, లంగా ఓణీ లేదా దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించాలి.
షార్ట్స్, టీ-షర్టులు, జీన్ ప్యాంట్లు, స్లీవ్‌లెస్ టాప్స్" తదితర నిర్దేశిత వస్త్రధారణకు భిన్నమైన దుస్తులకు అనుమతి ఉండదు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సైతం దేవస్థానం నిర్దేశించిన సంప్రదాయ వస్త్రధారణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ఔన్నత్యం, సనాతన సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ వస్త్రధారణ నియమావళిని భక్తులందరూ గౌరవించి, డిసెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా పాటించాలని ఈఓ జల్లేపల్లి వెంకటరావు విజ్ఞప్తి చేశారు. నిబంధనలపై సందేహాలు పెట్టుకోవడం లేదా అమలు విషయంలో మార్పులు ఉంటాయని భావించకుండా, భక్తులు ముందుగానే తగిన సంప్రదాయ దుస్తులతో దర్శనానికి రావాలని, దేవస్థాన సిబ్బంది, భద్రతా విభాగానికి సహకరించాలని ఆయన కోరారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




