|  
● FLASH NEWS
Ramayana: పుష్ప-2ను వెనక్కి నెట్టి టాప్-4లోకి.. బాహుబలి-2కు ఇక రూ.11 కోట్లే!  •  Bhogi: శర్వానంద్ శ్రమకు ప్రశంసలు.. రక్తపాతంపై విమర్శలు! థియేటర్లలోకి ‘భోగి’, తొలిరోజు టాక్ ఇదే  •  Captain: మూడేళ్ల తర్వాత మళ్లీ రోహిత్ చేతికే ముంబయి పగ్గాలు.. అదే తేదీ, ‘45’ సమయానికి ప్రకటన!  •  Delimitation: ప్రతి రాష్ట్రానికీ 50% అదనపు ఎంపీ సీట్లు.. 2051 వరకు వాటా పదిలం!  •  Kokapet: ఎకరం రూ.120 కోట్లు.. ఒక్క బిడ్డూ రాలేదు! నియోపోలిస్, మూసాపేట భూముల వేలం రద్దు  •  Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. ఏడాదిలో మరో 25 వేల సర్కారీ కొలువులు  • 
Skip to content

Delimitation: ప్రతి రాష్ట్రానికీ 50% అదనపు ఎంపీ సీట్లు.. 2051 వరకు వాటా పదిలం!

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ద్వారా మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రతి రాష్ట్రానికీ లోక్‌సభ (Lok Sabha) స్థానాలు ఒకే నిష్పత్తిలో 50 శాతం పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల నిష్పత్తి 2051 వరకు మారకుండా స్థిరంగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణాది ఆందోళనకు సమాధానం

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేక వీగిపోయింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పంచితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు దక్కి, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనే అప్పట్లో ప్రధాన అడ్డంకిగా మారింది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతామని ప్రభుత్వం సభలో హామీ ఇచ్చినా, ఆ అంశం బిల్లులో లిఖితపూర్వకంగా లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతిస్తున్నామని, పునర్విభజన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అవి స్పష్టం చేశాయి. ఆ ఓటమి తర్వాత దానికి అనుబంధంగా ఉన్న పునర్విభజన బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ లోపాన్ని సవరిస్తూ, ఏ రాష్ట్రమూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రాతినిధ్యం కోల్పోకుండా తాజా బిల్లులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 1971 జనాభా ఆధారంగా ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తి 2051 వరకు కొనసాగుతుంది. పెరిగిన స్థానాలకు నియోజకవర్గాల సరిహద్దులను మాత్రం 2011 జనగణన ఆధారంగా పునర్వ్యవస్థీకరిస్తారు.

543 నుంచి 850 వరకు

ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపాదిత సవరణ ప్రకారం సభ గరిష్ఠ బలాన్ని 850కి పెంచుతారు. ఇందులో రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ఉంటారు. 50 శాతం పెంపు లెక్కన ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు సుమారు 37–38కి, తెలంగాణకు ఉన్న 17 స్థానాలు సుమారు 25–26కి పెరిగే అవకాశం ఉంది. తుది సంఖ్యలపై స్పష్టత బిల్లు సభ ముందుకు వచ్చాకే రానుంది. 2023లో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియం అమలును జనగణన, పునర్విభజనతో ముడిపెట్టడంతో మహిళా రిజర్వేషన్ ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

నాలుగు రోజుల ప్రత్యేక భేటీ

ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఈ నెల 30, డిసెంబరు 1 తేదీల్లో, రాజ్యసభ డిసెంబరు 2, 3 తేదీల్లో సమావేశం కానున్నాయి. ఆగస్టులో వాయిదా పడిన వర్షాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఈ ప్రత్యేక భేటీ జరగనుంది. ప్రభుత్వం పిలిచే ప్రత్యేక సమావేశాల్లో దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లులు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరూ ఆదివారం ఉదయం 10 గంటలకల్లా దిల్లీలో ఉండాలని విప్ జారీ చేసింది. ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం కూడా తమ లోక్‌సభ సభ్యులకు మూడంచెల విప్ జారీ చేసింది.

ప్రత్యేక మెజారిటీయే అసలు పరీక్ష

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లోనూ సభ్యుల్లో మెజారిటీతో పాటు హాజరై ఓటేసిన వారిలో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా బిల్లు వీగిపోయింది. అధికార ఎన్డీయేకు సొంతంగా మూడింట రెండొంతుల బలం లేకపోవడంతో తటస్థ పార్టీల మద్దతే ఈసారి కీలకం కానుంది. తమకు సరిపడా బలం ఉందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష ఇండియా కూటమి శనివారం సమావేశమై వ్యూహం ఖరారు చేయనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని ఏర్పాటు చేసిన ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దిల్లీ చేరుకున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు