|  
● FLASH NEWS
Ramayana: పుష్ప-2ను వెనక్కి నెట్టి టాప్-4లోకి.. బాహుబలి-2కు ఇక రూ.11 కోట్లే!  •  Bhogi: శర్వానంద్ శ్రమకు ప్రశంసలు.. రక్తపాతంపై విమర్శలు! థియేటర్లలోకి ‘భోగి’, తొలిరోజు టాక్ ఇదే  •  Captain: మూడేళ్ల తర్వాత మళ్లీ రోహిత్ చేతికే ముంబయి పగ్గాలు.. అదే తేదీ, ‘45’ సమయానికి ప్రకటన!  •  Delimitation: ప్రతి రాష్ట్రానికీ 50% అదనపు ఎంపీ సీట్లు.. 2051 వరకు వాటా పదిలం!  •  Kokapet: ఎకరం రూ.120 కోట్లు.. ఒక్క బిడ్డూ రాలేదు! నియోపోలిస్, మూసాపేట భూముల వేలం రద్దు  •  Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. ఏడాదిలో మరో 25 వేల సర్కారీ కొలువులు  • 
Skip to content

Journalism: ప్రత్యేకత, స్థానికతతోనే చిన్న పత్రికలకు మనుగడ.. సదస్సులో వక్తల స్పష్టీకరణ

హైదరాబాద్, సూర్య న్యూస్ : చిన్న, మధ్యతరహా పత్రికలు పెద్ద పత్రికల ప్రచురణ శైలిని అనుకరించకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుని, స్థానిక సమస్యలకు ప్రాధాన్యమిస్తేనే పాఠకుల ఆదరణతో మనుగడ సాగించగలవని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘న్యూస్ పేపర్స్ ఎగ్జిబిషన్–2026’తో పాటు జరిగిన సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు, అనేక గొంతుకలు వినిపించాలంటే చిన్న పత్రికలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక గుర్తింపు, స్థానిక అంశాలే చిన్న పత్రికలకు బలం

పెద్ద పత్రికలతో పోటీ పడుతూ జాతీయ, రాష్ట్ర స్థాయి వార్తలనే ప్రధానంగా ప్రచురించడం వల్ల చిన్న పత్రికలకు ప్రత్యేక ప్రయోజనం ఉండదని ఆలపాటి సురేష్ కుమార్ పేర్కొన్నారు. పాఠకులు తమ పత్రికను ఎందుకు చదవాలనే ప్రశ్నకు సమాధానంగా ప్రతి పత్రిక విభిన్నమైన వార్తా శైలి, ప్రత్యేక గుర్తింపును అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానిక అంశాలు, ప్రజావసరాల కథనాలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. అమెరికా వంటి దేశాల్లో స్థానిక పత్రికలు తమ పరిధిలోని వార్తలు, ప్రకటనలతో స్వతంత్రంగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నాణ్యమైన సమాచారాన్ని అందిస్తే చిన్న పత్రికలకు ఆదరణ పెరుగుతుందని తెలిపారు.

నకిలీ పీడీఎఫ్‌లు, బ్లాక్‌మెయిల్‌పై ఆందోళన

పత్రికల పేరుతో పీడీఎఫ్ ప్రతులను ఫోన్లకు పంపుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న కొందరి వ్యవహారశైలి వల్ల నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు చెడ్డపేరు వస్తోందని ఆలపాటి సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తులను గుర్తించి జర్నలిజం రంగం నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఒకటి రెండు గొంతుకలకే పరిమితం కాకుండా భిన్నమైన అభిప్రాయాలు, వందలాది గొంతులు వినిపించేందుకు చిన్న పత్రికలు నిలదొక్కుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామీణ సమస్యలకు పత్రికల్లో ప్రాధాన్యం ఇవ్వాలి

అన్ని పత్రికల్లో ఒకే తరహా శీర్షికలు, వార్తలు కాకుండా విభిన్న కోణాలు, ప్రజల సమస్యలు ప్రతిబింబించాలని కె. శ్రీనివాస రెడ్డి సూచించారు. పెద్ద పత్రికలు పట్టించుకోని గ్రామీణ, స్థానిక సమస్యలను చిన్న పత్రికలు వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. గతంలో స్థానిక సమస్యలపై ప్రత్యేక ముద్ర వేసిన జమీన్ రైతు, జీవగడ్డ, కేకలు, ప్రజాతంత్ర వంటి పత్రికలు ప్రజల్లో ఆదరణ పొందడమే కాకుండా ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులను తీర్చిదిద్దాయని గుర్తుచేశారు.

చిన్న పత్రికల ప్రదర్శనలో పాల్గొన్న జర్నలిస్టులు, నిర్వాహకుల సమూహ చిత్రం
సదస్సులో పాల్గొన్న జర్నలిస్టులు, నిర్వాహకులు

PRGI నిబంధనలు, రికార్డుల నిర్వహణ తప్పనిసరి

పత్రికల నిర్వహణలో ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (PRGI) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కె. శ్రీనివాస రెడ్డి సూచించారు. వార్షిక నివేదికల దాఖలు, సర్క్యులేషన్ ధ్రువీకరణ పత్రాలు, న్యూస్‌ప్రింట్ కొనుగోలు బిల్లులు వంటి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రకటనల కేటాయింపులు, రేట్ల విషయంలో తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విధానంలో పారదర్శకతను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోనూ చిన్న పత్రికలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని పేర్కొన్నారు.

సమస్యలను సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ

చిన్న పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతినిధి బృందం ద్వారా సమాచార శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కె. శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. వార్తా సంస్థలు అందించే సమాచారాన్ని యథాతథంగా ప్రచురించకుండా జర్నలిస్టులు విచక్షణతో వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ మాట్లాడుతూ తమ అనుబంధ సంస్థ అయిన చిన్న పత్రికలు, మ్యాగజైన్స్ అసోసియేషన్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, బిల్లులు, ప్రకటనల విడుదల, అక్రిడిటేషన్ల జారీలో మద్దతు అందిస్తామని తెలిపారు.

ఎడిటర్లకు సర్టిఫికెట్లు, విజేతలకు జ్ఞాపికలు

అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్ స్వాగతం పలకగా, ఉపాధ్యక్షుడు డి. బాలకృష్ణ వందన సమర్పణ చేశారు. టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు రాజేష్, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు బాలరాజు, సలీంపాష, వనం నాగరాజు, చిలుకూరి హరి ప్రసాద్, కోశాధికారి ఆజం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ నాయకులు గార్లపాటి కృష్ణారెడ్డి, అల్వాల హనుమంత్, దయానంద్, అక్తర్ హుస్సేన్, యూసుఫుద్దీన్ ఖాద్రి, గోళ్ల రమేష్, రాంరెడ్డి, అఫ్రోజ్ ఖురేషి, జానకిరామ్, నాగమణి, నస్రీన్ ఖాన్, వెంకటయ్య తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు అతిథులు పత్రికల ప్రదర్శనను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఇటీవల ఐజేయు మహిళా సదస్సు విజయవంతానికి కృషి చేసిన మహిళా జర్నలిస్టును సత్కరించారు. అలాగే ఇజేయు జాతీయ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిరిగిరి విజయకుమార్ రెడ్డి, వరికుప్పల రమేష్, టీయూడబ్ల్యూజే కార్యదర్శులు వర్కాల యాదగిరి, కొంపెల్లి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా ఎడిటర్లకు సర్టిఫికెట్లు, విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు