
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి. దయాకర్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు
అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్లు braou.ac.in లేదా braouonline.in ద్వారా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. జనరల్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఫీజును 1500 రూపాయలుగా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు 1000 రూపాయలుగా ఫీజును ఖరారు చేశారు. ఈ రుసుమును ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కానీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఆన్‌లైన్ ఫ్రాంఛైజీ కేంద్రాల ద్వారా కానీ చెల్లించవచ్చు. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 28వ తేదీని ఆఖరు గడువుగా నిర్ణయించారు.
అక్టోబర్ 4న ఆఫ్‌లైన్‌లో పరీక్ష
ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను అక్టోబర్ 4వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మాత్రమే ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నారు. ప్రవేశాలకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయ టోల్ ఫ్రీ నంబర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ 040-23680222 నంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



