
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర మంత్రి బండి సంజయ్‌లపై (Bandi Sanjay) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు తెలంగాణకు చెందిన నేతలకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాష్ట్ర నాయకులు తమ హోదాను మరచిపోయి బానిసల కంటే హీనంగా తయారయ్యారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. ఢిల్లీలోని జాతీయ పార్టీల నాయకత్వం తెలంగాణ ప్రయోజనాల కంటే తమ సొంత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం ఢిల్లీ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పార్టీల వల్ల తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదని, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం తెలంగాణ నాయకత్వం స్వతంత్రంగా గళం వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎర్రవెల్లిలో అమరవీరుల కాలనీ నిర్మిస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను కేటీఆర్ తప్పుబట్టారు. అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంత దూరాన కాలనీ ఎందుకు నిర్మించాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మియాపూర్ భూముల్లోనే పేదలకు, తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ భూములను వెంటనే పేదల సంక్షేమానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఇళ్ల నిర్మాణం, ఉద్యమకారుల సంక్షేమం వంటి కీలక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కేటీఆర్ కోరారు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ నాయకత్వంపై కేటీఆర్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



