
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కూకట్‌పల్లి విభాగ్ కేపీహెచ్‌బీ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి డిగ్రీ కళాశాలలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ రేగోడ్ నాగేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోందని, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్రంలో సుమారు 9,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని నాగేష్ విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యా రంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించడమే కాకుండా, కేటాయించిన ప్రతి రూపాయిని విద్యార్థుల సంక్షేమానికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా కమిషన్ నిర్ణయాలపై ఆగ్రహం
ప్రస్తుత విద్యా కమిషన్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్థి వ్యతిరేకమైనవని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు, డైట్ రద్దు, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఎస్ఎస్‌సీ బోర్డు రద్దు వంటి ఆలోచనలను తక్షణమే విరమించుకోవాలని కోరారు. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థుల లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయడం, ఉపాధ్యాయుల జీతాలు తగ్గించడం వంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని హెచ్చరించారు.
అసెంబ్లీ ముట్టడికి సిద్ధం
విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే మరియు ఏబీవీపీ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ లేదా అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వంను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్‌బీ నగర కార్యదర్శి ఆకాష్, సంయుక్త కార్యదర్శి కార్తీక్, కార్యకర్తలు బెన్నీ, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని విద్యా మరియు ఉద్యోగ సమాచారం కోసం suryanews.in ని ఫాలో అవ్వండి.
మరిన్ని తాజా సమాచారం కోసం suryanews.in ని ఫాలో అవ్వండి.