
మేడ్చల్, సూర్య న్యూస్ : పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మేడ్చల్ జిల్లా చింతల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు, షాపూర్ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులతో పాటు తరగతి గదికి రెండు ఫ్యాన్లను ఏబీవీపీ నాయకులు అందజేశారు.

ఈ సందర్భంగా స్క్రీన్ టైమ్ టు ఎగ్జామ్ టైమ్ అనే నినాదంతో విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై అవగాహన కల్పించారు, పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పక్కనపెట్టి సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, వారికి విద్యాపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా ఏబీవీపీ ఎప్పుడూ ముందుంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.

ఈ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి విభాగ కన్వీనర్ రేగోడు నాగేష్, అడ్వకేట్ కేశవ్, మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయ, చింతల్ నగర సంయుక్త కార్యదర్శి చందు, మైసమ్మగూడ నగర కార్యదర్శి శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.