
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన ఎమోషనల్ పోస్ట్‌తో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ఆమె, తన భర్తతో దిగిన ఫోటోను మొదటి పోస్ట్‌గా షేర్ చేశారు. ఇప్పుడు, తన బావలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ పెట్టిన మరో పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
చిరంజీవి, నాగబాబులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అన్నా లెజ్నెవా ఇలా రాసుకొచ్చారు: “ఒకరిపై ఒకరు ఎప్పుడూ ప్రేమానురాగాలు చూపించే ఈ కుటుంబంలోకి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం, నేను అడుగుపెట్టాను. అక్కడ ఎలా ఇమడాలో నాకు తెలియలేదు. ఎవరిని ఏమని పిలవాలో కూడా నాకు తెలియలేదు. అందుకే నేను నా భర్త మాటలను అరువు తీసుకున్నాను. వాళ్లని అన్నయ్య.. చిన్న అన్నయ్య అని పిలిచాను. మొదట్లో అది నేను చెప్పే ఒక మాట మాత్రమే. కానీ తెలియకుండా కాలక్రమేణా, అది నాలో ఒక భావనగా మారింది. తర్వాత నేను వారిని మరో విధంగా కూడా పిలవవచ్చని తెలుసుకున్నాను. కానీ అప్పటికి… అది ఇక భాషకు సంబంధించిన విషయం కాదు. నాకు బ్రదర్ లేడు. కానీ ఈ బంధం నాకు ఇద్దరు సోదరులను ఇచ్చింది”.
అన్నా లెజ్నెవా షేర్ చేసిన ఈ పోస్ట్‌లో చిరంజీవి ప్రేమగా ఆమె బుగ్గను పట్టుకుని కనిపిస్తుండగా, పవన్ కళ్యాణ్ పక్కనే నిలబడి నవ్వుతున్నారు. నాగబాబుతో దిగిన సెల్ఫీని కూడా ఆమె పంచుకున్నారు. మెగా ఫ్యామిలీలోని ఈ అపూర్వ అనుబంధం మరియు అన్నా లెజ్నెవా భావోద్వేగ మాటలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బుధవారం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఆమెకు ఇప్పటికే 2.58 లక్షల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు మరియు ఈ పోస్ట్‌కు 228K పైగా లైకులు వచ్చాయి.