
మహిళా సాధికారత మరియు మహిళా సమస్యల పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కీలక అడుగు వేసింది. స్వచ్ఛంద సేవా సంస్థ ‘గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్’ (GIO) మహిళా కమిషన్ తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది. GIO ప్రతినిధులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజా రాయపాటిని కలిసి ఈ ఉమ్మడి చొరవపై చర్చించారు.
మహిళా కమిషన్ కార్యాలయంలో GIO ప్రతినిధులు చైర్పర్సన్ ను కలిశారు. సమావేశంలో, మహిళా సమస్యలపై మహిళా కమిషన్ తో కలిసి పనిచేయడానికి GIO NGO సిద్ధంగా ఉందని, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, మరియు మహిళల చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. GIO ప్రతినిధులు తమ సంస్థ వివరాలతో కూడిన కరపత్రాన్ని చైర్పర్సన్ కు అందజేశారు. మహిళా సమస్యలపై ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడానికి, వర్క్‌షాప్‌లు, మరియు ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని వారు తెలిపారు.

GIO కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల చైర్పర్సన్ డాక్టర్ శైలజా రాయపాటి సంతోషం వ్యక్తం చేశారు. “మహిళా సమస్యల పరిష్కారం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి పనిచేసినప్పుడే మెరుగైన సమాజాన్ని నిర్మించగలం. స్వచ్ఛంద సేవా సంస్థలు మహిళా కమిషన్ తో కలిసి పనిచేయడం వల్ల మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉమ్మడి చొరవ మహిళా సాధికారతకు మరియు సమాజంలో మహిళా సమస్యలపై అవగాహన పెంచడానికి దోహదపడుతుంది,” అని ఆమె పేర్కొన్నారు.