
జగద్గిరిగుట్ట, సూర్య న్యూస్ : సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎదిరించడమే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ స్పష్టం చేశారు, భగత్ సింగ్ మరియు రాజ్ గురు అలాగే సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతిని (Death Anniversary) పురస్కరించుకుని జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ (Bus Stop) మరియు భగత్ సింగ్ మార్గ్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు సిపిఐ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ నేటి యువత కుల మత రాజకీయాలకు అతీతంగా భగత్ సింగ్ ఆశించిన సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు, దేశ సహజ సంపదలు ప్రజలకే చెందాలని మరియు ఎవరూ దోపిడీకి గురికాకుండా సమానత్వంతో బతకాలని నూనూగు మీసాల వయసులోనే ఉరితాడును ముద్దాడిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ అని ఆయన గుర్తు చేశారు, ఎటువంటి త్యాగాలు చేయకుండా బ్రిటిష్ వారి కోసం పనిచేసిన సావర్కర్ లాంటి వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంటూ కొమరం భీమ్, ఛత్రపతి శివాజీ, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులు మరియు మేధావులపై ఉందని ఆయన అన్నారు.
ప్రజలు మూఢత్వంలో మునిగి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతే మరోసారి బానిసలుగా మారే ప్రమాదం ఉందని కావున విప్లవ వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని ఆయన హెచ్చరించారు, సిపిఐ (CPI) మండల కార్యదర్శి కే స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటీయూసీ (AITUC) జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, శాఖా కార్యదర్శులు సహదేవ రెడ్డి, నరసింహారెడ్డి, రవి అలాగే యువజన సంఘం నాయకులు మజ్జి గౌరీ, మారెప్ప, సోమయ్య, సామెల్, ఆశప్ప ఇమామ్, బాబు తదితరులు పాల్గొన్నారు.