Skip to content
Home » Biker Movie Review : ‘బైకర్’ రివ్యూ.. శర్వానంద్ రేసు గెలిచాడా? రాజశేఖర్ కంబ్యాక్ ఎలా ఉంది?

Biker Movie Review : ‘బైకర్’ రివ్యూ.. శర్వానంద్ రేసు గెలిచాడా? రాజశేఖర్ కంబ్యాక్ ఎలా ఉంది?

“మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ కొట్టాను.. ఈసారి ‘బైకర్’తో బ్లాక్‌బస్టర్ కొడుతున్నా” – ఇది ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శర్వానంద్ ఇచ్చిన స్టేట్‌మెంట్. తన సెలక్షన్ మీద, కంటెంట్ మీద శర్వాకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. టాలీవుడ్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ‘ఫైనెస్ట్ యాక్టర్’ అనిపించుకున్న శర్వా, ఈసారి ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇందులో శర్వాకు తండ్రిగా నటించడం మరో పెద్ద విశేషం. మరి ఈ ‘బైకర్’ బాక్సాఫీస్ రేసులో గెలిచాడా? ప్రేక్షకుల మనసులను తాకాడా? లెట్స్ సీ..

కథ:​

వికాశ్ నారాయణ్ (శర్వానంద్)కు తన భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకు ఇషాన్ లతో కూడిన చిన్న ప్రపంచమే లోకం. కొడుకును ఎంతో ప్రేమగా చూసుకునే వికాశ్, ఒకరోజు స్కూల్లో జరిగిన ఘటన వల్ల తన తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) ను గుర్తు చేసుకుంటాడు. సునీల్ ఒకప్పుడు గొప్ప మోటోక్రాస్ రేసింగ్ ఛాంపియన్. కానీ, సరైన ప్రోత్సాహం లేక అనుకున్న స్థాయికి ఎదగలేకపోతాడు. తన కొడుకు వికాస్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా చూడాలనేది సునీల్ కల. అందుకోసం విక్కీకి కఠోర శిక్షణ ఇస్తాడు.

తండ్రి కల కోసం రేసింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న విక్కీ, ఒక బడా స్పాన్సరింగ్ కంపెనీ ఓనర్ ఇంద్రనీల్ (అతుల్ కులకర్ణి)తో బాండ్ రాసుకుంటాడు. కానీ, అనూహ్యంగా ఒక్క ఛాంపియన్ షిప్ రేసులో మాత్రమే పాల్గొని, తండ్రికి కనీసం చెప్పకుండా ఒక్క ఉత్తరం రాసి విక్కీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. అసలు ప్రాణప్రదమైన రేసింగ్‌ను విక్కీ ఎందుకు వదిలేశాడు? తండ్రి కలను నెరవేర్చడానికి మళ్ళీ రేసులోకి దిగాడా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:​

ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిలిం అంటూ ప్రమోట్ చేసిన ‘బైకర్’, ఆ నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు మనకు కొత్త కాకపోయినా, బైక్ రేసింగ్‌తో ఒక పూర్తి స్థాయి కథను తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు. ఇండియన్ ఆడియన్స్ క్రికెట్‌కు కనెక్ట్ అయినంతగా రేసింగ్‌కు కనెక్ట్ కారు. అయినా సరే, దర్శకుడు అభిలాష్ రెడ్డి డేరింగ్‌గా ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, పెర్ఫామెన్సులు, కథ, కథనం, మరియు బలమైన ఎమోషన్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. గతంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా ఏ స్థాయిలో అయితే ఎమోషన్, ప్యాషన్, మరియు డ్రామాతో పండిందో, ‘బైకర్’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకి ఫీల్ ఇచ్చేలా ఉంది. స్పోర్ట్ మారినా, ఎమోషన్ మాత్రం అదే లెవల్‌లో ఉంది.​

ముఖ్యంగా బైక్ రేసింగ్ సీన్లన్నీ థియేటర్లో చూసేటప్పుడు వేరే లెవల్‌లో అనిపించాయి. ఎక్కడా సినిమా చూస్తున్నట్లుగా కాకుండా, రియల్ రేసింగ్‌ను చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించడంలో టీమ్ సక్సెస్ అయింది. క్లైమాక్స్ రేసింగ్ సీక్వెన్స్ మరియు ఆ తర్వాత నడిచిన డ్రామా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

నటీనటుల పనితీరు:​

ఈ సినిమా కోసం శర్వానంద్ ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రేసర్‌లా కనిపించడం కోసం లుక్ మార్చుకోవడం, 20 కిలోల బరువు తగ్గడం, ఇలా రెండేళ్ల పాటు పడ్డ కష్టం వృథా పోలేదు. శర్వా బైక్ రేసింగ్ చేసిన ప్రతిసారి ఒక హీరో కాదు, నిజమైన రేసర్‌నే చూసిన ఫీలింగ్ వచ్చింది. అలాగే, ఫాదర్ సెంటిమెంట్‌ను కూడా శర్వా చాలా బాగా పండించాడు.

​ఇక సినిమాలో ‘బుల్లెట్ నారాయణ’ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక అద్భుతమైన పాత్రలో మెప్పించారు. హీరోగా మాత్రమే చేద్దామనుకుని ఇలాంటి పాత్రలు ఎన్నో వచ్చినా వదులుకున్న రాజశేఖర్, ఈ కథలో మాత్రం హీరోతో సమానమైన పాత్ర చేశారు. సునీల్ నారాయణ పాత్రే ఈ కథకు ప్రాణం. అలాంటి పాత్రను తన అనుభవంతో, నటనతో మరో స్థాయిలో నిలబెట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌కి హగ్ ఇచ్చే సీన్‌లో రాజశేఖర్ నిజంగా ఏడిపించారు.​

మాళవిక నాయర్‌కి కూడా ఒక మంచి పాత్ర దక్కింది. ఫస్టాఫ్‌లో గ్లామర్‌తో మెప్పించిన మాళవిక, ఇంటర్వెల్ ముందు మరియు సెకండాఫ్‌లో నటనతో మెప్పించింది. కథలో ఆమె పాత్ర కూడా కీలకమే. ఇక విలన్‌గా అతుల్ కులకర్ణి మెప్పించారు. బ్రహ్మాజీ, తులసి సహా మిగిలిన యాక్టర్లు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:​

సినిమాకు జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద హైలైట్. రేసింగ్ సీన్లకి మరియు ఎమోషనల్ సీన్లకి బిజీఎమ్ బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు టాప్ నాచ్‌గా ఉన్నాయి. సినిమలో డైలాగులు ఎక్కువగా లేకపోయినా, ఉన్న డైలాగులన్నీ కథను మరింత బలంగా ఆడియన్స్‌కు తాకేలా రాశారు. “ప్రతి కొడుక్కీ యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు” అంటూ చెప్పిన డైలాగ్ ఆయా సన్నివేశాల్ని మరింత ఎలివేట్ చేసింది.

​ముగింపు:​

ఓవరాల్‌గా శర్వానంద్ చెప్పినట్లే, ‘బైకర్’ కేవలం రేసునే కాదు, ప్రేక్షకుల మనసుల్నీ గెలిచాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఎమోషన్, ప్యాషన్, మరియు అద్భుతమైన రేసింగ్ సీన్ల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. రానున్న రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణను బట్టి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రేంజ్ డిసైడ్ అవుతుంది.

ప్లస్ పాయింట్స్:​

శర్వానంద్, రాజశేఖర్ అద్భుత నటన​మోటోక్రాస్ రేసింగ్ సీక్వెన్స్​బలమైన ఫాదర్-సన్ ఎమోషన్​బ్యాక్ గ్రౌండ్ స్కోర్ & టెక్నికల్ వాల్యూస్​

మైనస్ పాయింట్స్:​

స్లో నారేషన్ (కొన్ని చోట్ల)​కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం

ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘బైకర్’.. రేసు గెలిచాడు.. మనసుల్నీ తాకాడు!​

నటీనటులు: శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్, అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, తులసి తదితరులు

దర్శకత్వం: అభిలాష్ రెడ్డి

నిర్మాత: యూవీ క్రియేషన్స్

సంగీతం: జిబ్రాన్

విడుదల తేదీ: 3 ఏప్రిల్ 2026

Surya Rating: 3.25/5 ⭐

Surya News Team

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.