
బొంతపల్లి, సూర్య న్యూస్ : గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాటసాని శ్రీనివాస్ గౌడ్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కాసేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించి బ్రహ్మోత్సవాల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బొంతపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.