
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో పారిశుధ్య నిర్వహణపై సీఎం పలు కీలక సూచనలు చేశారు.
ఇంటింటికీ చెత్త సేకరణ తప్పనిసరి
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని సీఎం స్పష్టం చేశారు. చెత్త సేకరణ ప్రక్రియలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఒక్కో వాహనాన్ని ఒక్కో నిర్దేశిత ప్రాంతానికి కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్తగా గుర్తించిన డమ్పింగ్ యార్డులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
నిర్మాణ వ్యర్థాలపై ప్రత్యేక నిఘా
నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్మాణ వ్యర్థాలను వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రత కారణంగా వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల పట్ల నగరవాసులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.