రాజేంద్రనగర్ టు మెహదీపట్నం వరకు ఆక్రమణల తొలగింపు.. నిబంధనల ఉల్లంఘనపై కేసుల నమోదు

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘ఆపరేషన్ రోప్’ (ROPE) డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. ట్రాఫిక్ డీసీపీ-III రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో సోమవారం రాజేంద్రనగర్ పోలీసులు రోడ్లపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పాదచారులకు మార్గం సుగమం:
హైదర్‌గూడ పిల్లర్ నంబర్ 143 నుండి మెహదీపట్నం పిల్లర్ నంబర్ 118 వరకు సర్వీస్ రోడ్లు మరియు ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను పోలీసులు క్లియర్ చేశారు. రహదారిపై అడ్డంగా వాహనాలు నిలిపిన వారిపై మరియు ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరించారు.
చట్టపరమైన చర్యలు:
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సిపి యాక్ట్ సెక్షన్ 39(బి) మరియు 41 కింద కేసులు నమోదు చేశారు. రహదారులపై ట్రాఫిక్ సాఫీగా సాగేలా, పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.