
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలపై జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులకు సంబంధించి ఆయన ఆయా దేశాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై దాడులు చేసే ఉద్దేశం ఇరాన్ కు లేదని, జరిగిన పొరపాట్లపై చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సమన్వయ లోపమే కారణం
ఇరాన్ ప్రభుత్వ మీడియాలో మాట్లాడిన పెజెష్కియాన్.. పొరుగు దేశాలపై జరిగిన దాడులను “దురదృష్టకరం” అని అభివర్ణించారు. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత సైనిక బలగాల్లో తలెత్తిన సమన్వయ లోపం వల్ల కొన్ని దాడులు జరిగాయని ఆయన వివరించారు. గల్ఫ్ దేశాలన్నీ తమ సోదర దేశాలని, వారితో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
తాత్కాలిక కౌన్సిల్ కీలక నిర్ణయం
ఇరాన్‌ను ప్రస్తుతం పాలిస్తున్న తాత్కాలిక నాయకత్వ కౌన్సిల్ శుక్రవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పొరుగు దేశాలపై ఎటువంటి దాడులు చేయకూడదని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, పొరుగు దేశాల భూభాగాల నుంచి ఇరాన్ పై దాడులు జరిగితే మాత్రం వాటిని తిప్పికొట్టే హక్కు తమకు ఉందని కౌన్సిల్ తేల్చి చెప్పింది.

ట్రంప్ డిమాండ్ పై ఘాటు స్పందన
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. “ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా కంటున్న కలలు ఎప్పటికీ నెరవేరవు. ఆ కలలను వారు సమాధి చేసుకోవాల్సిందే” అని పెజెష్కియాన్ హెచ్చరించారు. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు తాము శాంతి వైపు అడుగులు వేస్తున్నామే తప్ప, భయపడి కాదని ఆయన స్పష్టం చేశారు.