
లక్నో, సూర్య న్యూస్ డెస్క్ : కేవలం ఐదు నెలల వ్యవధిలో ఏకంగా 23 మందికి ఉరిశిక్షలు విధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి (UP Judge Ravi Kumar) రవికుమార్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) బదిలీ చేసింది. ముజఫర్‌నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఆయనను ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
వరుస ఉరిశిక్షలతో సంచలనం
ముజఫర్‌నగర్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో హత్య, కిడ్నాప్, దోపిడీ తదితర 11 కేసుల్లో ఏకంగా 23 మంది దోషులకు మరణశిక్ష విధించారు. 2018లో భార్యను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడైన నదీమ్ (38) అనే వ్యక్తికి కూడా ఆయన తాజాగా ఉరిశిక్ష ఖరారు చేశారు. గతంలో వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు ఆదేశించింది కూడా ఈ న్యాయమూర్తే కావడం గమనార్హం.
జడ్జి తీర్పులతో లాయర్లలో వణుకు
జడ్జి రవికుమార్ వరుసగా మరణశిక్షలు విధిస్తుండటంతో స్థానిక లాయర్లలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తమ కేసుల్లోనూ ఆయన ఉరిశిక్షలు విధిస్తారనే భయంతో న్యాయవాదులు జిల్లా బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిపాలనా పరమైన ఆదేశాలు జారీ చేస్తూ, రవికుమార్ వద్ద పెండింగ్‌లో ఉన్న 100 హత్య కేసులను జిల్లా అండ్ సెషన్స్ జడ్జి వీరేంద్ర కోర్టుకు బదిలీ చేశారు.
సీనియర్ జడ్జిని ప్రశ్నించడంతోనే..
తన పరిధిలో ఉన్న 97 కేసులను ఉపసంహరించి వేరే కోర్టుకు బదిలీ చేయడంపై సీనియర్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను రవికుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. జడ్జి కుర్చీలో ఉన్నంత కాలం కేసులపై నిర్ణయాధికారం తనకే ఉంటుందని, తాను సర్వీసులో ఉన్నంత కాలం తన సూత్రాలకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ జడ్జి నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించిన నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టు రవికుమార్‌ను ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



