
చెన్నై, సూర్య న్యూస్ డెస్క్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వన్‌నెస్ (Oneness) సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (Kalki Bhagavan) కన్నుమూశారు. గత పది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు.
కల్కి భగవాన్ మరణ వార్తను ఆయన ట్రస్టు ప్రతినిధులు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. భక్తుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని తిరుపతి జిల్లా బత్తులవల్లంలోని ‘ఏకం’ ఆలయానికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తుల సందర్శనకు ఉంచనున్నామని, శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ట్రస్ట్ వర్గాలు స్పష్టం చేశాయి.
క్లర్క్ నుంచి భగవాన్‌గా..
తమిళనాడులోని వేలూరు జిల్లాలో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు తొలినాళ్లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో సాధారణ క్లర్క్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిన ఆయన, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన ఒక చిన్న ఆశ్రమం క్రమంగా వన్‌నెస్ విశ్వవిద్యాలయంగా ఎదిగింది. తనను తాను విష్ణువు దశమ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్న ఆయన, దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులను ఆకర్షించారు.
వివాదాలు.. ఐటీ దాడులు
సామాన్య ఉద్యోగి స్థాయి నుంచి గ్లోబల్ ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన కల్కి భగవాన్ ప్రస్థానం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆయన బోధనలు ఒకవైపు ప్రాచుర్యం పొందుతుండగానే, మరోవైపు ఆయన సామ్రాజ్యంపై ఆర్థిక ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 2019లో ఆయన ఆశ్రమాలు, కుమారుడికి చెందిన వ్యాపార సంస్థలపై ఐటీ శాఖ భారీ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని వందల కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, విదేశీ పెట్టుబడులు బయటపడటం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



