
అయోధ్య, సూర్య న్యూస్ : అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) పరిపాలనాపరంగా కీలక నిర్ణయం తీసుకుంది. రామమందిరం తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా (Jitendra Mishra)ను నియమించింది. ఇటీవల ఆలయ విరాళాల దుర్వినియోగం, నిధుల గోల్‌మాల్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ, మరింత పటిష్టం చేసే దిశగా ట్రస్ట్ ఈ నియామకం చేపట్టింది. బుధవారం అయోధ్యలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అధికారిక నిర్ణయం తీసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ హీరోకు కీలక బాధ్యతలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో 31 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జితేంద్ర మిశ్రాకు డిఫెన్స్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. పాకిస్థాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆయన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా వ్యవహరించారు. ఆయన సేవలకు గాను అత్యున్నత సైనిక పురస్కారమైన ‘సర్వోత్తమ్ యుద్ధ్ సేవా మెడల్’ కూడా లభించింది. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం, భద్రతా మేనేజ్‌మెంట్, ఆపరేషనల్ డిసిప్లిన్, ఆలయ పవిత్రతను కాపాడటం వంటి కీలక బాధ్యతలను ఆయన సీఈవో హోదాలో పర్యవేక్షించనున్నారు. సీఈవో పోస్టు కోసం వచ్చిన సుమారు 5,585 దరఖాస్తులను రెండు నెలల పాటు పరిశీలించిన అనంతరం కమిటీ ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది.
ముగ్గురు కొత్త ట్రస్టీలు.. తొలిసారిగా మహిళకు అవకాశం
సీఈవో నియామకంతో పాటు, ట్రస్ట్‌లోని మూడు ఖాళీలను కూడా బోర్డు భర్తీ చేసింది. ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్యకు చెందిన న్యాయవాది మదన్ మోహన్ పాండే, షికోహాబాద్‌కు చెందిన నిర్మలా యాదవ్‌లను కొత్త ట్రస్టీలుగా నియమించారు. రామ జన్మభూమి ట్రస్ట్‌లో ఒక మహిళకు ట్రస్టీగా అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మహేష్ భగచంద్కా ట్రస్ట్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టనుండగా, స్వామి గోవింద్ దేవ్ గిరి ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.
రాజీనామాల నేపథ్యంలోనే కొత్త నియామకాలు
గత జులై నెలలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ట్రస్టీగా ఉన్న అయోధ్య రాజకుటుంబీకుడు విమ్లేంద్ర ప్రతాప్ మిశ్రా మరణించారు. దీంతో ఏర్పడిన ఈ మూడు ఖాళీల స్థానంలోనే తాజాగా కొత్తవారిని నియమించారు. బుధవారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో 2025-26 వార్షిక లెక్కలకు సైతం ఆమోదం తెలిపారు. 2026 మార్చి 31 నాటికి ట్రస్ట్ వద్ద మొత్తం రూ.1,882 కోట్ల నిధులు ఉన్నట్లు లెక్కల్లో వెల్లడించారు. కాగా, సీఈవోగా జితేంద్ర మిశ్రా నియామకాన్ని వీహెచ్‌పీ స్వాగతించింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



