
ఖమ్మం: జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులు బరితెగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన విద్యాసంస్థలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడటంతో కాలేజీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.

ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. గాయపడిన విద్యార్థికి రహస్యంగా చికిత్స చేయించినట్లు సమాచారం. కానీ, అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఈ ఘర్షణను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఇలా వీధి రౌడీల్లా కొట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఖమ్మం సీఐ భానుప్రకాష్ వెల్లడించారు.