
హైదరాబాద్, సూర్య న్యూస్ : నాగార్జునసాగర్ జలాశయం నుంచి రాబోయే మూడు నెలల తాగునీటి అవసరాల కేటాయింపుపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. 19 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పెట్టిన ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. కృష్ణా డెల్టా వ్యవస్థకు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదని తెలంగాణ స్పష్టం చేయడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సాగిన భేటీ ప్రతిష్టంభనతో ముగిసింది.
ఏపీ, తెలంగాణ ఇండెంట్లలో తీవ్ర తేడాలు
రెండు తెలుగు రాష్ట్రాల తక్షణ తాగునీటి అవసరాలను సమీక్షించేందుకు బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కుమార్ కాంబోజ్ అధ్యక్షతన ఈ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఓ.వి. రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె. నరసింహ మూర్తి హాజరయ్యారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ భేటీలో నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా 9 టీఎంసీలతో పాటు కృష్ణా డెల్టా వ్యవస్థ అవసరాల కోసం అదనంగా మరో 10 టీఎంసీలు కలిపి మొత్తం 19 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ సమర్పించింది.
మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు సాగర్ ఆధారిత ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం ఫిబ్రవరి నెలాఖరు వరకు 21 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. ఉదయం ప్రారంభమైన చర్చలు సాయంత్రం వరకు గంటల తరబడి కొనసాగినప్పటికీ, జలాశయంలో ఉన్న నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు గణాంకాలతో తమ తమ వాదనలకు కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు.
తెలంగాణ వాదన ఇదీ
సమావేశం అనంతరం తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు మాట్లాడుతూ కృష్ణా డెల్టా వ్యవస్థ అవసరాలకు నాగార్జునసాగర్ నీటి విడుదలతో ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఆ 10 టీఎంసీల ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించామని చెప్పారు. కుడి కాలువ ద్వారా ఏపీ కోరిన 9 టీఎంసీలకూ ఎలాంటి సమర్థన లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల జలాశయంలో ప్రస్తుతం 26.75 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీలో 2.44 టీఎంసీల నీరు నిల్వ ఉందని, దానికి తోడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని ఆయన కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల వచ్చిన మూడు తుపాన్ల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయని, కృష్ణా బేసిన్‌లో తగినంత నీటి లభ్యత ఉన్నందున సాగర్ నుంచి 19 టీఎంసీలు కోరడం సరికాదని తెలంగాణ వాదించింది. ఇరు రాష్ట్రాల వాదనలు, నీటి లభ్యత, తాగునీటి ప్రాధాన్యత అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు వీలైనంత త్వరగా బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరినట్లు రమేష్ బాబు వెల్లడించారు.
సాగర్ నీటిమట్టంపై భిన్నాభిప్రాయాలు
సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 534.4 అడుగుల వద్ద ఉంది. కనీస నీటిమట్టానికి పైన కేవలం 45.4 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ అధికారులు కమిటీకి వివరించారు. ఇందులో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకే కనీసం 15 టీఎంసీలు అవసరమని, మిగిలిన 25 టీఎంసీలు ఈ నీటి సంవత్సరంలో తెలంగాణ వినియోగించుకోని వాటాను భర్తీ చేసేందుకే సరిపోవని స్పష్టం చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ అధికారులు తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గలేదు. సాగర్ జలాశయంలో కనీస నీటిమట్టానికి దిగువన 490 అడుగుల స్థాయి వరకు నీటిని తోడుకుని రాష్ట్ర అవసరాలకు విడుదల చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ ఇంజనీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కనీస నీటిమట్టానికి దిగువన ఉన్న జలాలను కేవలం అత్యవసర తాగునీటి పరిస్థితులకు మాత్రమే భద్రపరచాలని పట్టుబట్టారు.
సహజంగా వేసవి సమీపిస్తున్న తరుణంలో తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టా వ్యవస్థ, హైదరాబాద్ తాగునీటి సరఫరా అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నందున త్రిసభ్య కమిటీ తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది. సాగర్ జలాశయంలో నీటి మట్టం, ఇతర రిజర్వాయర్ల నిల్వలను సమీక్షించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి సమావేశం జరిగిన తర్వాతే తదుపరి నీటి విడుదలపై స్పష్టత రానుంది. ఆ భేటీ తేదీపై బోర్డు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



