
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల పండుగలకు సముచిత ప్రాధాన్యత కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండుగలు తమ ఉనికిని కోల్పోతున్నాయని, కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా లేకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. శనివారం సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రజా రంజక పాలన బీఆర్ఎస్‌దే
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ వంటి పథకాలతో ప్రజలందరినీ ఆదరించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలను విస్మరిస్తూ ప్రజలను గోస పెడుతోందని మండిపడ్డారు. రంజాన్ మాసం అనేది ఆత్మపరిశుద్ధికి, సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో ప్రేమ, ఐక్యత పెరగాలన్నదే ఈ పవిత్ర మాసం సందేశమని ఆయన పేర్కొన్నారు.

శాంతి సౌభాగ్యాలు నెలకొనాలి
అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించిన కేటీఆర్.. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, BRS నాయకులు శంబీపూర్ రాజు, మైనారిటీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.