
కూకట్పల్లి, సూర్య న్యూస్ : ఇళ్లు, స్థలాల కోసం దీక్ష చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు (Telangana Agitators) కూకట్పల్లి ప్రెస్ క్లబ్ (TWJF) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు డిమాండ్ చేశారు.
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్బీ రోడ్ నంబర్ వన్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. తమకు కేటాయించాల్సిన ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ప్రెస్ క్లబ్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు హాజరై వారికి సంఘీభావం తెలిపారు. అక్కడే ఉన్న ఉద్యమకారులతో మాట్లాడి వారి సమస్యలు, ప్రధాన డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.
సబ్ కమిటీ వేయాలి
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికిచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఉద్యమకారులను అధికారికంగా గుర్తించేందుకు వెంటనే చట్టపరమైన సబ్ కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే వారికి నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
రెండున్నరేళ్లు గడుస్తున్నా..
గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండున్నరేళ్లు గడుస్తున్నా తమను పట్టించుకోలేదని, అందుకే గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు విద్యా వెంకట్, రామారావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



