
కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) పనిచేస్తుందని, జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షపూరిత వైఖరిపై పోరాడేందుకు ఐక్యంగా సిద్ధం కావాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య (Mamidi Somaiah) పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం అంబేద్కర్ భవన్‌లో శుక్రవారం జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ నాలుగో మహాసభ విజయవంతంగా ముగిసింది.
జర్నలిస్టుల కోసమే పుట్టిన సంఘం
ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మామిడి సోమయ్య మాట్లాడుతూ.. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఏ ఒక్క పత్రికకు అనుకూలం కాదని స్పష్టం చేశారు. పాలకుల పక్షాన కాకుండా నిరంతరం జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు తదితర సంక్షేమ పథకాల సాధనకు భవిష్యత్తులో ఉద్యమిస్తామని ఆయన ప్రకటించారు. గతంలో కీలక పదవులు అనుభవించిన కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘం ప్రతిష్ఠను దెబ్బతీశారని, మళ్లీ జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొనేలా జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తామని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తెలిపారు.

కుత్బుల్లాపూర్ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అంగూరు గోవిందరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శివ, ఉపాధ్యక్షులుగా డప్పు రామస్వామి, మంజులా రెడ్డి, దివాకర్, వెంకట నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మచారి, కోశాధికారిగా కొండా సంజీవ కుమార్ ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రవీణ్ రాజ్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా తేజోమూర్తి తదితరులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు కుంచం శ్రీనివాస్, జగదీష్ గుప్తా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, సీనియర్ జర్నలిస్టులు శివ పార్వతి, స్వప్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



