
హైదరాబాద్, సూర్య న్యూస్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని తక్షణమే ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కలిశారు. తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఒక సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు.
అక్రెడిటేషన్, హెల్త్ కార్డుల కోసం విజ్ఞప్తి
రాష్ట్రంలోని అన్ని కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని నేతలు కోరారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇళ్ల స్థలాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు
చట్టపరమైన మార్గాలను పరిశీలించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నేతలు కోరారు. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గుర్తించి ప్రత్యేక సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. చిన్న, మధ్యతరహా పత్రికలకు గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల బిల్లులను వెంటనే చెల్లించి వాటి మనుగడకు సహకరించాలని డిమాండ్ చేశారు.
ఉచిత విద్య, బీమా సౌకర్యం
సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఫెడరేషన్ కోరింది. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టులందరికీ ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించి, మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం అందించేలా చూడాలని కోరారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



