Skip to content
Home » చరిత్రలో ఈ రోజు: మార్చి 10: గ్రహాలు అన్నీ ఒకే వైపు చేరితే ప్రపంచం అంతమా? 1982లో ఏమైందో తెలుసా?

చరిత్రలో ఈ రోజు: మార్చి 10: గ్రహాలు అన్నీ ఒకే వైపు చేరితే ప్రపంచం అంతమా? 1982లో ఏమైందో తెలుసా?

1982 మార్చి 10న సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ సూర్యునికి ఒకే వైపున వరుసకట్టడంతో ప్రపంచం అంతమవుతుందని రేగిన తీవ్ర భయాందోళనలు ఈనాటి చరిత్రలో ఒక ఆసక్తికర ఘట్టంగా మిగిలిపోయింది.

భయం పుట్టించిన ‘ది జూపిటర్ ఎఫెక్ట్’ పుస్తకం

అప్పట్లో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ మరియు ప్లూటో గ్రహాలన్నీ సూర్యునికి 95 డిగ్రీల కోణంలో ఒకే వైపుకు సమీపించాయి, ఈ అరుదైన ఖగోళ వింతను ఆధారంగా చేసుకుని 1974లో జాన్ గ్రిబిన్ మరియు స్టీఫెన్ ప్లాగ్‌మాన్ అనే ఇద్దరు బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్తలు ‘ది జూపిటర్ ఎఫెక్ట్’ (The Jupiter Effect) అనే బెస్ట్ సెల్లర్ పుస్తకాన్ని రచించారు.

వినాశనం తప్పదంటూ హెచ్చరికలు

ఈ పుస్తకంలో వారు చేసిన అంచనాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించాయి, గ్రహాల ఉమ్మడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సూర్యునిపై టైడల్ ఫోర్స్ పెరిగి సోలార్ ఫ్లేర్స్ వెలువడతాయని తద్వారా భూమి భ్రమణ వేగం మారుతుందని వారు అందులో పేర్కొన్నారు, దీనివల్ల ముఖ్యంగా కాలిఫోర్నియాలోని సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ వద్ద అత్యంత భయంకరమైన భూకంపం మరియు సునామీలు వస్తాయని లాస్ ఏంజిల్స్ నగరం నాశనమవుతుందని వారు హెచ్చరించారు.

ప్రజల్లో తీవ్ర ఆందోళన

సైన్స్ మరియు ఆస్ట్రాలజీ కలగలిపినట్లుగా ఉన్న ఆ పుస్తకానికి మీడియా సైతం భారీగా ప్రచారం కల్పించడంతో వినాశనం తప్పదని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడ్డారు, భద్రత కోసం నిత్యావసరాలు నిల్వ చేసుకోగా మరికొందరైతే ఏకంగా ఎండ్-ఆఫ్-ది-వరల్డ్ పార్టీలు కూడా జరుపుకున్నారు.

అసలు ఆ రోజు ఏమైందంటే ?

అందరూ భయపడిన ఆ 1982 మార్చి 10వ తేదీ రానే వచ్చింది కానీ ప్రపంచం అంతం కాలేదు, కనీసం అసాధారణ భూకంపాలు కానీ వరదలు కానీ రాలేదు, సూర్యునిపై ఫ్లేర్స్ సైతం పెరగలేదు, గ్రహాలు ఒకే పర్ఫెక్ట్ సరళ రేఖలో కాకుండా 95 డిగ్రీల మేర విస్తరించి ఉండటం వల్ల వాటి గురుత్వాకర్షణ ప్రభావం సూర్యునిపై ఏమాత్రం పడలేదని ముందుగా ఊహించినట్లుగానే ఆ ఇంపాక్ట్ శూన్యమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు

తప్పు ఒప్పుకున్న రచయిత

తన అంచనా పూర్తిగా తప్పని తేలిపోవడంతో జాన్ గ్రిబిన్ తన తప్పును అంగీకరించారు, తదనంతర కాలంలో ‘బియాండ్ ది జూపిటర్ ఎఫెక్ట్’ పేరుతో మరో పుస్తకం రాసి తన పాత థియరీలను సవరించారు, కేవలం ఒక పుస్తకం మరియు మీడియా హైప్ ప్రజల్లో ఏ స్థాయిలో భయాన్ని సృష్టిస్తాయో చెప్పడానికి 1982 నాటి ఈ సంఘటన ఒక స్పష్టమైన నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *