
ఢిల్లీ, సూర్య న్యూస్ : భారత మహిళల క్రికెట్ చరిత్రలో ధ్రువతారగా వెలిగిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను బీసీసీఐ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ముంబైలో జరిగిన ‘నామన్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమెకు ‘బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును అందజేశారు. ఈ వేదికపై బీసీసీఐ కార్యదర్శి జై షా చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు ఆమె చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. అవార్డు అందుకున్న అనంతరం మిథాలీ రాజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. బీసీసీఐ నుంచి ఈ గౌరవం అందుకోవడం పట్ల గర్వంగా ఉందని, భారత్‌లో మహిళల క్రికెట్ ఎదుగుదలను దగ్గరుండి చూడటం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు.
రికార్డుల రారాణి మిథాలీ
1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలీ, సుమారు 23 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన క్రీడాకారిణిగా ఆమె పేరిట ప్రపంచ రికార్డు ఉంది. భారత్‌ను రెండుసార్లు (2005, 2017) ప్రపంచకప్ ఫైనల్స్‌కు నడిపించిన ఘనత ఆమెకే దక్కుతుంది. టెస్టుల్లోనూ 214 అత్యధిక స్కోరుతో పాటు 2,991 పరుగులు సాధించి మహిళల క్రికెట్‌కు కొత్త దిశను చూపారు.
ఈ అవార్డు వేడుకలో మిథాలీ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆరెంజ్ టోన్డ్ డిజైనర్ ఔట్ఫిట్లో మెరిసిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళల క్రికెట్లో ఆమె పోషించిన పాత్ర వెలకట్టలేనిదని, భావి తరాలకు ఆమె ఒక స్ఫూర్తి అని బీసీసీఐ ఈ సందర్భంగా కొనియాడింది. మిథాలీకి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల క్రీడా లోకం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.