
శాలిగౌరారం, సూర్య న్యూస్ : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి తీవ్రంగా గాయపడిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్‌ను శనివారం పలువురు నేతలు పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వెంకటయ్య గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని బాధితుడి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోల్కపురి శ్రీకాంత్ గౌడ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి చరవాణి (ఫోన్) ద్వారా తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందిస్తూ, ప్రమాదానికి గురైన గీతా కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం మరియు వ్యక్తిగతంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గీతా కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో గౌడ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు యమగాని హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి యాదయ్య గౌడ్, కప్పల నారాయణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్ మరియు ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రమాదకరమైన వృత్తిలో ఉండి ఇలాంటి విపత్తులు ఎదుర్కొనే గీతా కార్మికులకు ప్రభుత్వం నుండి వెంటనే ఎక్స్‌గ్రేషియా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.